
కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, అక్టోబర్ 24:
కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి వైఎస్సార్‌సీపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. నామినేషన్ల దాఖలు సమయంలో తమ పార్టీ అభ్యర్థులకు ఎదురైన పరిస్థితులపై అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్సీ భరత్ తెలిపారు. ఈ అంశంపై న్యాయపరంగా ముందుకు వెళ్లనున్నట్లు వెల్లడించారు. కుప్పంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రామకుప్పం మండలంలో నామినేషన్ల దాఖలు సందర్భంగా తమ పార్టీ అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురైనట్లు భరత్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీ, రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి తమకు అందిన సమాచారం, అధికారుల నుంచి వెల్లడైన వివరాల మధ్య స్పష్టత అవసరమని అభిప్రాయపడ్డారు. రామకుప్పం మండలంలో వైఎస్సార్‌సీపీకి సంబంధించి 17 నామినేషన్లు దాఖలైనట్లు రిటర్నింగ్ అధికారి తెలిపిన విషయాన్ని ఎమ్మెల్సీ భరత్ ప్రస్తావించారు. వాటిలో 16 నామినేషన్లకు సంబంధించి తమకు అభ్యంతరాలు ఉన్నాయని పేర్కొన్నారు. చివరి రోజు సాయంత్రం 89 పెద్దూరు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినట్లు వివరించారు. శాంతిపురం మండలంలోని ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియపైనా తమ పార్టీ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసిందని భరత్ తెలిపారు. రామకుప్పం మండలంలో ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణను నిలిపివేయాలని కోరుతూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. ఈ వ్యవహారంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి తమ అభ్యంతరాలను తెలియజేస్తామని చెప్పారు. సుబ్రమణ్యస్వామి ఆలయం వద్ద ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందుల అంశాన్ని కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు భరత్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయ పార్టీలు తమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి ఓట్లు కోరాలని అన్నారు. ఎన్నికలు పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.


Recent Comments