
కుప్పం,చిత్తూరు ఎక్స్ప్రెస్, అక్టోబర్ 26:
కుప్పం మున్సిపాలిటీ పరిధిలో తాను చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను వెంటనే చెల్లించాలని, లేనిపక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని వైసీపీ నేత సీపీ మనోహర్ స్పష్టం చేశారు. ఆదివారం కుప్పంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తనకు ఎదురవుతున్న ఆర్థిక, వ్యక్తిగత ఇబ్బందులను వివరిస్తూ ఆయన కన్నీటిపర్యంతమయ్యారు. స్థానిక టీడీపీ నేత నుంచి తనకు బెదిరింపులు ఎదురవుతున్నాయని ఆరోపిస్తూ రక్షణ కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా సీపీ మనోహర్ మాట్లాడుతూ కుప్పం మున్సిపాలిటీ పరిధిలో సుమారు రూ.1.25 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. పనులు పూర్తి చేసినప్పటికీ బిల్లులు చెల్లించక పోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్ల నిర్మాణ పనుల కోసం తమ కుటుంబానికి చెందిన నగలను సైతం బ్యాంకుల్లో తాకట్టు పెట్టి నిధులు సమకూర్చుకున్నామని పేర్కొన్నారు. బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా అప్పుల భారం పెరుగుతోందని తెలిపారు. బిల్లుల చెల్లింపు కోసం సంబంధిత కార్యాలయాలకు వెళ్లినప్పుడు కమీషన్ అడుగుతున్నారని ఆయన ఆరోపించారు. తమకు చెందిన జల్లి ఫ్యాక్టరీ నుంచి నెలకు రూ.1.25 లక్షలు వసూలు చేశారంటూ స్థానిక టీడీపీ నేతపై ఆరోపణలు చేశారు. వైసీపీ జెండా ఎత్తితే చంపేస్తామని బెదిరిస్తున్నారని పేర్కొంటూ తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. ఈ ఆరోపణలపై సంబంధిత వ్యక్తుల స్పందన తెలియాల్సి ఉంది.
*బిల్లులు చెల్లించకపోతే న్యాయపోరాటం*
తాను చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను నిబంధనల ప్రకారం వెంటనే చెల్లించాలని సీపీ మనోహర్ డిమాండ్ చేశారు. బిల్లుల చెల్లింపులో జాప్యం కొనసాగితే సంబంధిత డీఈ, ఏఈలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని తెలిపారు. పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు.
*చంద్రబాబు, లోకేష్ స్పందించాలని విజ్ఞప్తి*
తనకు ఎదురవుతున్న ఇబ్బందులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ స్పందించాలని సీపీ మనోహర్ విజ్ఞప్తి చేశారు. స్థానిక టీడీపీ నేత వ్యవహారంపై పార్టీ అధిష్ఠానం విచారణ జరిపి, తనకు న్యాయం చేయడంతో పాటు రక్షణ కల్పించాలని కోరారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా వైఎస్సార్సీపీని వీడి మరో పార్టీలో చేరబోనని స్పష్టం చేశారు.


Recent Comments