
గుడిపల్లి,చిత్తూరు ఎక్స్‌ప్రెస్,జూన్ 19:
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లి మండలం జేకే పల్లి గ్రామంలో గురువారం రాత్రి పల్లెనిద్ర, ధైర్యస్పర్శ కార్యక్రమాలను పోలీసులు నిర్వహించి ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. కుప్పం రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో, గుడిపల్లి సబ్‌ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్, పోలీసు సిబ్బందితో కలిసి ధైర్యస్పర్శ వాహనం ద్వారా గ్రామాన్ని సందర్శించి ప్రజలను చైతన్యపరిచారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతా నియమాలు, మహిళలు,చిన్నారుల భద్రత, సైబర్ నేరాల నివారణ, ధైర్యస్పర్శ సేవలు, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, ఆన్‌లైన్ మోసాలపై ప్రజలకు వివరించారు. అదేవిధంగా పోక్సో చట్టం ప్రాధాన్యత, చిన్నారులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించి, అనుమానాస్పద ఘటనలు ఎదురైన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్, సందేశాలు, అనుమానాస్పద లింకులు, బ్యాంకు వివరాలు అడిగే వ్యక్తులను నమ్మవద్దని హెచ్చరించారు. వ్యక్తిగత సమాచారం,ఓటీపీ నంబర్లు ఎవరికీ వెల్లడించకూడదని సూచించారు. మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో ప్రభుత్వం, పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని, సమస్యలు ఎదురైనప్పుడు భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని తెలిపారు.గ్రామాల్లో ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై అవగాహన కల్పించడం ద్వారా నేరాల నివారణతో పాటు భద్రతపై నమ్మకాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పోలీసులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు, యువకులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


Recent Comments