
సూళ్లూరుపేట,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూన్02:
తిరుపతిజిల్లా సూళ్లూరుపేట తడమండలంలోని మాంబట్టు సెజ్ ప్రాంతంలో కార్మికులను తరలిస్తున్న బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న గోడను ఢీకొట్టిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. ప్రమాదంలో బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడగా, బస్సులో ప్రయాణిస్తున్న కార్మికులు సురక్షితంగా బయటపడడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం ప్రకారం అపాచి పరిశ్రమకు చెందిన కార్మికులను తీసుకెళ్తున్న తనేలి బస్సు మాంబట్టు సమీపంలో వెళ్తుండగా అకస్మాత్తుగా బస్సు టైరు పేలిపోయింది. దీంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో బస్సు రోడ్డుపక్కనున్న గోడను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో పలువురు కార్మికులు ప్రయాణిస్తున్నారు. అయితే అదృష్టవశాత్తూ వారికి ఎలాంటి గాయాలు కాలేదు. బస్సు డ్రైవర్‌కు మాత్రం తీవ్ర గాయాలు కావడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే స్థానికులు, సహచర కార్మికులు సహాయక చర్యలు చేపట్టి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనతో బస్సులో ఉన్న కార్మికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి టైరు పేలిపోవడమే ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. తడ పోలీస్ స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడంతో కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. పరిశ్రమలకు చెందిన వాహనాల నిర్వహణలో యాజమాన్యాలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, వాహనాల సాంకేతిక స్థితిని తరచూ పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు.


Recent Comments