
సూళ్లూరుపేట,చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూన్ 02:
తిరుపతి జిల్లా సూళ్లూరు పేటమండలంలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నూతన డైరెక్టర్గా ప్రముఖ శాస్త్రవేత్త ఎస్. ముత్తుచెళియన్ నియమితులయ్యారు. ప్రస్తుతం అసోసియేట్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఆయన, మే 31న పదవీ విరమణ పొందిన ఈ.ఎస్. పద్మకుమార్ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు. తమిళనాడుకు చెందిన ఎస్. ముత్తుచెళియన్ 1967 జూలై 13న జన్మించారు. 1991లో ఇంజినీరింగ్ విద్య పూర్తి చేసి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థలో చేరారు. మూడు దశాబ్దాలకు పైగా అంతరిక్ష రంగంలో సేవలందిస్తూ అనేక కీలక బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు. ప్రయోగ వాహనాల రూపకల్పన, అభివృద్ధి, ప్రయోగాల నిర్వహణ, సాంకేతిక సమన్వయంలో విశేష అనుభవం కలిగిన ఆయన, సంస్థ చేపట్టిన పలు ప్రతిష్ఠాత్మక అంతరిక్ష కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం షార్ అసోసియేట్ డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తూ ప్రయోగాల నిర్వహణలో తన ప్రతిభను చాటుకున్నారు. దేశంలోనే అత్యంత కీలకమైన అంతరిక్ష ప్రయోగ కేంద్రంగా గుర్తింపు పొందిన శ్రీహరికోట షార్ డైరెక్టర్గా ఎస్. ముత్తుచెళియన్ నియామకం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన అనుభవం, సాంకేతిక పరిజ్ఞానం, నాయకత్వ లక్షణాలు సంస్థకు మరింత బలాన్ని చేకూరుస్తాయని అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన మాజీ డైరెక్టర్ ఈ.ఎస్. పద్మకుమార్ను ఎస్. ముత్తుచెళియన్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సేవలను కొనియాడుతూ భవిష్యత్ కార్యక్రమాలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న రోజుల్లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టనున్న ఉపగ్రహ ప్రయోగాలు, ప్రయోగ వాహనాల కార్యక్రమాలు, అంతరిక్ష పరిశోధనల విజయవంతమైన అమలులో ఎస్. ముత్తుచెళియన్ నాయకత్వం కీలకంగా నిలుస్తుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


Recent Comments