కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మార్చి12:
కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి మత్స్య యోజన పథకం ద్వారా కుప్పం నియోజకవర్గంలోని మత్స్యకారులకు ప్రోత్సాహం లభించింది. ఈ పథకం కింద గురువారం కుప్పం నియోజకవర్గ పరిధిలోని మత్స్యకారుల సొసైటీలకు సుమారు 77 వేల చేప పిల్లలను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్న బంగారునాత్తం చెరువులో సుమారు 46 వేల చేప పిల్లలను మత్స్యకారుల సొసైటీ ఆధ్వర్యంలో సంబంధిత అధికారుల సమక్షంలో ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ ఉపాధ్యక్షులు పిఎస్ మునిరత్నం, పి కే ఎం వుడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు ల చేతుల మీదగా చేప పిల్లలను చెరువులోకి వదిలారు. చేపల పెంపకాన్ని ప్రోత్సహించడం ద్వారా మత్స్యకారుల ఆదాయాన్ని పెంచడం, గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి అవకాశాలను మెరుగుపరచడం ఈ పథకం ప్రధాన ఉద్దేశమని ఈ సందర్భంగా వారు తెలిపారు. చేపల వేటపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న మత్స్యకారుల కుటుంబాలకు ప్రధానమంత్రి మత్స్య యోజన పథకం ఎంతో ఉపయోగకరంగా మారుతోందన్నారు. చెరువుల్లో చేప పిల్లలను వదలడం ద్వారా భవిష్యత్తులో మంచి దిగుబడి లభించి మత్స్యకారుల ఆదాయం పెరుగుతుందని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. ప్రధానంగా చేపల వేట ఆధారంగా జీవించే బెస్త కులస్తుల అభ్యున్నతికి సహకరిస్తూ ప్రధానమంత్రి మత్స్య యోజన పథకం ద్వారా ఉచిత చేప పిల్లలను పంపిణీ చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బెస్త కులస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గ పరిధిలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, మత్స్యకారుల సొసైటీ సభ్యులు, మత్స్యశాఖ అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


Recent Comments