పది లో మొదటి స్థానంలో నిలిస్తే రూ.5వేలు బహుమతి
డాక్టర్ యల్లంపాటి కోటేశ్వరబాబు
శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తి ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ పదవ తరగతి పరీక్షల్లో మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థికి రూ.5వేలు నగదు బహుమతి అందిస్తానని ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ యల్లంపాటి కోటేశ్వరబాబు ప్రకటించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని భాస్కర్ పేట, పానగల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు రాయబోతున్న 65 మంది విద్యార్థులకు బుధవారం ఆయన పరీక్ష సామాగ్రి అందజేశారు. ఈ సందర్భంగా యల్లంపాటి కోటేశ్వరబాబు మాట్లాడుతూ… “పదవ తరగతి అనేది ప్రతి విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన మలుపు. పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదు. ప్రతి విద్యార్థి పట్టుదలతో, క్రమశిక్షణతో చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో అద్భుతమైన ప్రతిభ ఉంటుంది, దానికి సరైన ప్రోత్సాహం తోడైతే వారు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ప్రభుత్వ బడుల్లో చదివే పేద విద్యార్థులకు నా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది అన్నారు. సమాజ సేవలో తనదైన ముద్ర వేస్తున్న డాక్టర్ యల్లంపాటి కోటేశ్వరబాబు, ప్రభుత్వ బడుల్లో చదివే పేద విద్యార్థుల పట్ల తనకున్న మక్కువను మరోసారి చాటుకున్నారు. కేవలం ప్రోత్సాహకాలకే పరిమితం కాకుండా, విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో ఆయన ముందుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది శ్రీకాళహస్తి మండలం, శ్రీకాళహస్తి పట్టణం మొత్తం కలిపి 546 మంది విద్యార్థులకు పదవ తరగతి పరీక్ష సామాగ్రి అందజేశామని గర్వంగా ప్రకటించారు. విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంచేందుకు, మండలం, పట్టణ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన వారికి రూ.5,000 నగదు పురస్కారం ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఆయన చేస్తున్న ఈ కృషి అభినందనీయమని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కొనియాడుతున్నారు. పరీక్షా సామాగ్రిని అందుకున్న విద్యార్థులు తమపై నమ్మకం ఉంచి సహకరిస్తున్న డాక్టర్ కోటేశ్వరబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ, కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధిస్తామని ప్రతిజ్ఞ చేశారు.


Recent Comments