
కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూన్ 10:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పాడి రైతులకు 50 శాతం రాయితీపై పశుదాణ పంపిణీ కార్యక్రమాన్ని దాసాయగానూరు గ్రామ పంచాయతీ రైతు సేవా కేంద్రంలో ప్రారంభించారు. పాడి పరిశ్రమ అభివృద్ధి, పాల ఉత్పత్తి పెంపుదల లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ పథకం కింద 50 కిలోల పశుదాణ బస్తా ధర రూ.1,110 కాగా, రైతు వాటాగా కేవలం రూ.555 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. పశుదాణ పొందాలనుకునే రైతులు ముందుగా తమ పాడి పశువులకు ఐనాఫ్ గుర్తింపు చెవికమ్మలు వేయించుకుని, రైతు సేవా కేంద్రం ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని అధికారులు తెలిపారు. నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే పశుదాణ పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. కుప్పం ప్రాంతంలో పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు నాయకులు పేర్కొన్నారు. ప్రస్తుతం దాసాయగానూరులో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని త్వరలో మండలంలోని అన్ని రైతు సేవా కేంద్రాలకు విస్తరించనున్నట్లు తెలిపారు. పాడి పశువులు ఉన్న ప్రతి అర్హ రైతు కుటుంబానికి పశుదాణ అందజేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఏపీఎస్‌ఆర్టీసీ ఉపాధ్యక్షుడు పి.ఎస్. మునిరత్నం, టీటీడీ బోర్డు సభ్యుడు శాంతారం, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాజగోపాల్, మాజీ ఏఎంసీ ఛైర్మన్ సత్యేంద్ర శేఖర్, రాష్ట్ర డైరెక్టర్లు చెక్కునత్తం మణి, శరవణ, కడ సభ్యులు రామచంద్ర, ధనశేఖర్, మురళి సుబ్బు, స్థానిక రైతులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.


Recent Comments