
వి.కోట,చిత్తూరు ఎక్స్‌ప్రెస్,జూన్ 28:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం వి.కోట మండలంలో విజయవంతంగా నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలియో బూత్‌లు, పాఠశాలలు, గ్రామ సచివాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. చిన్నారులను తీసుకొచ్చిన తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా క్షయ, ఎయిడ్స్, కుష్ఠు వ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ వెంకటప్రసాద్ ఓగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పోలియో కార్యక్రమం నిర్వహణను పరిశీలించారు. అనంతరం మండలంలోని పలు పోలియో బూత్‌లను తనిఖీ చేసి, వైద్య సిబ్బందికి కార్యక్రమం మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సూచనలు, సలహాలు అందించారు. రికార్డులను పరిశీలించిన అనంతరం డాక్టర్ వెంకటప్రసాద్ మాట్లాడుతూ, మండలంలో మొత్తం 8,333 మంది లక్ష్య చిన్నారుల్లో 8,169 మందికి పోలియో చుక్కలు వేయడం జరిగిందని, దీంతో 98.03 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపారు. మిగిలిన చిన్నారులకు కూడా ఇంటింటి సర్వే ద్వారా పోలియో చుక్కలు వేయించి శాతం పెంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి తల్లిదండ్రులు సహకరించాలని, ఐదేళ్లలోపు ఏ చిన్నారినీ పోలియో చుక్కలకు దూరం చేయవద్దని వైద్యాధికారులు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


Recent Comments