
శాంతిపురం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, జూన్ 28:
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలోని చిన్నారిదొడ్డి గ్రామంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాల్లో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమాన్ని చిన్నారిదొడ్డి గ్రామ పంచాయతీ అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఐదేళ్లలోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం తల్లిదండ్రుల బాధ్యత అని పేర్కొన్నారు. ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో విస్తృతంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెస్కో డైరెక్టర్ చరణ్ కుమార్, మాజీ పంచాయతీ పార్టీ అధ్యక్షులు జి.ఎస్. రఘుపతి, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, ఏఎన్‌ఎంలు, స్థానిక ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


Recent Comments