
రేణిగుంట,చిత్తూరు ఎక్సప్రెస్,జూన్ 11 :
తిరుమల శ్రీవారి దర్శనార్థం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లీసా గిల్ తిరుపతి జిల్లాకు చేరుకున్నారు. విజయవాడ నుంచి వందే భారత్ రైలులో ప్రయాణించిన ఆమె గురువారం రేణిగుంట రైల్వే స్టేషన్‌కు చేరుకోగా జిల్లా యంత్రాంగం ఘన స్వాగతం పలికింది. రేణిగుంట రైల్వే స్టేషన్‌లో జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, జిల్లా పోలీసు అధికారి సుబ్బారాయుడు పుష్పగుచ్ఛాలు అందజేసి ఆత్మీయంగా స్వాగతించారు. ప్రధాన న్యాయమూర్తి రాక సందర్భంగా రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ప్రోటోకాల్ నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించారు. ప్రధాన న్యాయమూర్తి పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ సమన్వయంతో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమలు చేశాయి. రైల్వే స్టేషన్‌లో భద్రతా సిబ్బందిని మోహరించి, సందర్శన కార్యక్రమం సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. రేణిగుంటలో స్వాగత కార్యక్రమం అనంతరం లీసా గిల్ రోడ్డు మార్గంలో తిరుమలకు బయలుదేరి వెళ్లారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ, పోలీసు, రైల్వే శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రధాన న్యాయమూర్తి పర్యటన ప్రశాంతంగా, విజయవంతంగా సాగేందుకు అధికారులు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.


Recent Comments