
కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూన్ 12:
చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో మరో అరుదైన వైద్య విజయం నమోదైంది. చాలా కాలంగా తీవ్రమైన మోకాలి నొప్పితో బాధపడుతూ నడవడానికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ 55 ఏళ్ల మహిళకు వైద్యులు విజయవంతంగా మోకాలు మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించి ఆమెకు నవజీవనాన్ని ప్రసాదించారు. కుప్పం మండలం పెద్దబంగారునత్తం గ్రామానికి చెందిన మహిళ తీవ్ర మోకాలి సమస్యతో కుప్పం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించారు. వైద్య పరీక్షల అనంతరం ఆమెకు మోకాలు మార్పిడి శస్త్రచికిత్స అవసరమని నిర్ధారించిన వైద్యులు వెంటనే చికిత్సకు శ్రీకారం చుట్టారు. ఆసుపత్రి ఆర్థోపెడిక్ విభాగ నిపుణుడు డాక్టర్ క్రాంతికుమార్ ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. అనంతరం రోగిని ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందించగా, ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడటంతో శుక్రవారం డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయకుమారి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శస్త్రచికిత్సలో అనస్థీషియా నిపుణులు డాక్టర్ సాహిల్, డాక్టర్ సిద్ధేశ్వర్, వైద్యురాలు డాక్టర్ పూజితతో పాటు నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది కీలక పాత్ర పోషించారు. విజయవంతమైన శస్త్రచికిత్సను పూర్తి చేసిన వైద్య బృందాన్ని సహచర వైద్యులు అభినందించారు. రోగి కుటుంబ సభ్యులు వైద్యులు, సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఇంత నాణ్యమైన వైద్యం లభించడం సంతోషకరమని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచిన ఈ ఘటన కుప్పం ఏరియా ఆసుపత్రి వైద్యుల సేవా తపనకు నిదర్శనంగా నిలిచింది.


Recent Comments