
చిత్తూరు,చిత్తూరు ఎక్స్ప్రెస్,జూలై 17:
ప్రజలకు నాణ్యమైన ప్రాథమిక వైద్య సేవలను మరింత చేరువ చేయడం, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. చిత్తూరు నగరంలోని ప్రశాంత్ నగర్ (సీబీఎన్ కాలనీ)లో నూతనంగా ఏర్పాటు చేసిన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (యూపీహెచ్సీ)ను శుక్రవారం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నగరంలో ఇప్పటికే ఏడు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు పనిచేస్తున్నాయని, ప్రశాంత్ నగర్ యూపీహెచ్సీ ద్వారా సుమారు 20 వేల మంది ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. రక్తపోటు, మధుమేహం వంటి అసంక్రమిత వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. తక్కువ ఉప్పుతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, మద్యపానానికి దూరంగా ఉండడం వంటి అలవాట్లు పాటించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘సంజీవని’ కార్యక్రమం ద్వారా ప్రజల ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేసి నిరంతర వైద్య పర్యవేక్షణ చేపడుతున్నామని, త్వరలో యూపీహెచ్సీల ద్వారా సంజీవని కార్డులను అందజేయనున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ, ప్రజల నివాస ప్రాంతాల్లోనే ఆధునిక వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం యూపీహెచ్సీల ను ఏర్పాటు చేస్తోందన్నారు. నగర అభివృద్ధిలో భాగంగా సాంబయ్యకండిగ–కట్టమంచి రహదారి, దర్గా సర్కిల్–ఇరువరం రోడ్డు పనులను వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు. కట్టమంచి నుంచి ఎమ్మెస్సార్ వరకు నాలుగు లేన్ల రహదారి అభివృద్ధికి రూ.37 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు. ప్రజల సహకారంతో చిత్తూరును దశలవారీగా అభివృద్ధి చేసి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నగరంలో రహదారి విస్తరణకు సహకరించిన భవన యజమానులు, ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇన్చార్జ్ జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డా.జి.వెంకట ప్రసాద్ మాట్లాడుతూ, యూపీహెచ్సీలో సాధారణ వైద్యసేవలతో పాటు గర్భిణీలు, బాలింతలు, శిశువులకు ప్రత్యేక ఆరోగ్య సేవలు, టీకా కార్యక్రమాలు, అసంక్రమిత వ్యాధుల పరీక్షలు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు, ఉచిత మందుల పంపిణీ, అవసరమైన ప్రయోగశాల పరీక్షలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ కుమారి ఆముద, చూడా చైర్పర్సన్ హేమలత, టీడీపీ నాయకులు నాని, సి.కే. లావణ్య, వైద్య అధికారులు, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.



Recent Comments