EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. 12 కేసులు, నలుగురు మృతి కడప జిల్లాలోనే అత్యధిక కేసులు – ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యశాఖ సూచన

📰 Generate e-Paper Clip

అమరావతి, చిత్తూరు ఎక్స్‌ప్రెస్,17:

 

ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ కరోనా (కోవిడ్-19) కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. జూన్ 26 నుంచి జులై 16 వరకు రాష్ట్రంలో నిర్వహించిన పరీక్షల్లో మొత్తం 12 మందికి కరోనా వైరస్ సోకినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో నలుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, మృతులందరూ ఇప్పటికే అధిక రక్తపోటు, మధుమేహం, కిడ్నీ సంబంధిత వ్యాధులు వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఈ ఏడాది తొలి కరోనా కేసు జూన్ 26న వైఎస్సార్ కడప జిల్లాలో నమోదైంది. అనంతరం జులై తొలి రెండు వారాల్లో మరో 11 కేసులు వెలుగుచూశాయి. మొత్తం నమోదైన కేసుల్లో ఇద్దరు గతంలో కరోనా సోకిన వ్యక్తులతో సన్నిహితంగా మెలిగినట్లు అధికారులు గుర్తించారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే వైఎస్సార్ కడప జిల్లాలో అత్యధికంగా 8 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో రెండు, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. అయితే ఇవన్నీ వేర్వేరు ప్రాంతాల్లో నమోదైన కేసులేనని, ఒకే ప్రాంతంలో గుంపుగా వైరస్ వ్యాప్తి చెందిన పరిస్థితి లేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలకు వైద్యశాఖ సూచనలు కరోనా కేసులు మళ్లీ నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యశాఖ సూచించింది. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాసకోశ సంబంధిత లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మరింత జాగ్రత్తలు పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రత, చేతుల పరిశుభ్రత, అవసరమైన సందర్భాల్లో మాస్కు ధరించడం వంటి నివారణ చర్యలను పాటించాలని అధికారులు కోరారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!