EPAPER
Thursday, August 20, 2026
Google search engine

మామిడి రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: ఆర్డీఓకు మామిడి రైతు సంఘం వినతి

📰 Generate e-Paper Clip

 

పలమనేరు, చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూలై 01:

 

ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ మామిడి రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం పలమనేరు ఆర్డీఓ కార్యాలయం వద్ద రైతులు నిరసన వ్యక్తం చేశారు. జిల్లా ఉపాధ్యక్షులు ఉమాపతి నాయుడు నాయకత్వంలో రైతులు ఆర్డీఓతో పాటు మండల తహసీల్దార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు ఉమాపతి నాయుడు, రిటైర్డ్ మెజిస్ట్రేట్ మధుసూదన్ రావు, సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ తోతాపురి మామిడికి ప్రభుత్వం ప్రకటించిన ధరలు జిల్లాలో అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత వారం వరకు ప్రభుత్వ గుర్తింపు పొందిన ర్యాంపుల్లో కిలోకు రూ.4 చెల్లించగా, గత ఐదు రోజులుగా కేవలం రూ.3 మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలను అన్ని ర్యాంపుల్లో తప్పనిసరిగా బోర్డులపై ప్రదర్శించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం 2026 సంవత్సరానికి తోతాపురి మామిడికి కిలోకు రూ.7.50 మద్దతు ధర ప్రకటించినప్పటికీ జిల్లాలోని ఏ గుజ్జు పరిశ్రమ కూడా ఆ ధరను అమలు చేయడం లేదని విమర్శించారు. గతంలో కిలోకు రూ.6గా ఉన్న ధరలను ఇటీవల చాలా ఫ్యాక్టరీలు రూ.5కు తగ్గించి బోర్డులు ఏర్పాటు చేశాయని, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. మామిడి కొనుగోళ్లపై పర్యవేక్షణ కోసం జిల్లా స్థాయి కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలని, గత ఏడాది గుజ్జు పరిశ్రమలు రైతులకు చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే పొగాకు బోర్డు తరహాలో ప్రత్యేక మ్యాంగో బోర్డును ఏర్పాటు చేయాలని, ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్న రైతులకు నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. మామిడి పంటను పంటల బీమా పథకంలో చేర్చడంతో పాటు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మామిడి తోటలకు పూర్తిగా వర్తింపజేయాలని కోరారు. ప్రభుత్వం అనుమతించిన ర్యాంపుల్లో కూడా గుజ్జు పరిశ్రమలు చెల్లించే ధరలనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మద్దతు ధర అమలు చేయని ర్యాంపులు, గుజ్జు పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుని జిల్లాలోని 40 వేల మందికి పైగా మామిడి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో జిల్లావ్యాప్తంగా మామిడి రైతులతో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం నాయుడు, మధుసూదన్ రావు (రిటైర్డ్ మెజిస్ట్రేట్), అభ్యుదయ రైతు దొరస్వామి నాయుడు, నరసింహారెడ్డి, వాసు, విజయ్ కుమార్ రెడ్డి, యోగానంద రెడ్డి, చరణ్ చౌదరి, దేవేందర్ రెడ్డి తదితర రైతులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!