

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూన్ 13:
చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో అక్రమ గ్రానైట్ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. టమాటా లోడ్ల ముసుగులో అక్రమంగా గ్రానైట్ రాళ్లను తరలిస్తున్న రెండు లారీలను పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. పోలీసుల కథనం ప్రకారం,కుప్పం పరిసరప్రాంతాల నుంచి గ్రానైట్ రాళ్లను అక్రమంగా తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం అందడంతో డీఎస్పీ పార్థసారథి ఆదేశాల మేరకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో టమాటా లోడ్ల పేరుతో వెళ్తున్న రెండు లారీలను తనిఖీ చేయగా, వాటిలో అక్రమంగా గ్రానైట్ రాళ్లు తరలిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే లారీలను అదుపులోకి తీసుకుని సంబంధిత పత్రాలను పరిశీలించారు. రవాణాకు అవసరమైన అనుమతులు, ధ్రువపత్రాలు సక్రమంగా లేకపోవడంతో రెండు వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ వ్యవహారంలో సంబంధిత వ్యక్తుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. గ్రానైట్ రవాణా పేరుతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ పార్థసారథి హెచ్చరించారు. అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. గ్రానైట్ రవాణాకు సంబంధించిన అన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘనలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాయని, ప్రజలు కూడా అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం అందించి సహకరించాలని పోలీసులు కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.


Recent Comments