EPAPER
Thursday, August 20, 2026
Google search engine

మామిడి రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం ముఖ్యమంత్రికి మామిడి రైతు సంఘం వినతి – త్వరలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తామని హామీ

📰 Generate e-Paper Clip

 

తిరుపతి, చిత్తూరు ఎక్స్‌ప్రెస్, జూన్ 13:

 

ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మామిడి రైతు సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి వినతిపత్రం సమర్పించారు. తిరుపతికి విచ్చేసిన ముఖ్యమంత్రిని జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ సమక్షంలో కలిసిన రైతు సంఘం నాయకులు పలు కీలక సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మామిడి రైతు సంఘం అధ్యక్షుడు మునీశ్వర్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో రైతుల సమస్యలపై ముఖ్యమంత్రితో సుదీర్ఘంగా చర్చించారు. సమస్యలను సానుకూలంగా పరిశీలించిన ముఖ్యమంత్రి, రాష్ట్ర స్థాయి అధికారులు, సంబంధిత మంత్రులతో త్వరలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు రైతు సంఘం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా మునీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మామిడి సీజన్ ప్రారంభమైనప్పటికీ ప్రభుత్వం రైతు సంఘాలతో చర్చలు జరపకపోవడం బాధాకరమన్నారు. తోతాపురి మామిడికి రైతుల పెట్టుబడి ఖర్చులు, కార్మిక వ్యయాలు, ఎరువులు, పురుగుమందుల ఖర్చులు గణనీయంగా పెరిగాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో తోతాపురి మామిడికి కిలోకు కనీసం రూ.18 ధర నిర్ణయించాలని డిమాండ్ చేశారు. గత ఏడాది కిలో తోతాపురికి రూ.12 కనీస ధర నిర్ణయించిన ప్రభుత్వం, ఈసారి కేవలం రూ.7 మాత్రమే నిర్ణయించడం రైతులకు తీవ్ర అన్యాయం చేసినట్లేనని విమర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన ధరను కూడా గుజ్జు పరిశ్రమలు అమలు చేయడం లేదని ఆరోపించారు. ప్రతి గుజ్జు పరిశ్రమ వద్ద ధరల పట్టికలు ప్రదర్శించాలని, రైతులకు న్యాయమైన ధరలు అందేలా జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేయాలని కోరారు. ఇంకా ప్రారంభం కాని గుజ్జు పరిశ్రమలను వెంటనే ప్రారంభించి రైతుల వద్ద నుంచి మామిడి కాయలను సేకరించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని పరిశ్రమలు వ్యాపారుల వద్ద మాత్రమే కాయలను కొనుగోలు చేస్తున్నాయని, రైతుల వద్ద నుంచి నేరుగా సేకరణ జరిగేలా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. ఉపాధి హామీ పథకాన్ని మామిడి తోటలతో అనుసంధానం చేయాలని, గత ఏడాది రైతులకు చెల్లించాల్సిన బకాయిలను గుజ్జు పరిశ్రమల ద్వారా వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మామిడి రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక మామిడి బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతున్న రైతులకు నష్టపరిహారం అందించాలని కోరారు. మామిడి పంటను కూడా పంటల బీమా పరిధిలోకి తీసుకురావాలని, రైతులు తమ ఉత్పత్తులను నేరుగా విక్రయించేందుకు డిజిటల్ మార్కెట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ పనిముట్లను 50 శాతం సబ్సిడీతో అందించాలని, రాంపుల ద్వారా విక్రయించే మామిడికి కూడా గుజ్జు పరిశ్రమలు చెల్లించే ధరనే వర్తింపజేయాలని కోరారు. రైతుల సమస్యలను పూర్తిగా విన్న ముఖ్యమంత్రి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, మంత్రులతో చర్చించి వీలైనంత త్వరగా పరిష్కార మార్గాలు అమలు చేస్తామని హామీ ఇచ్చినట్లు రైతు సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు హేమలత, బెల్లంకొండ శ్రీనివాసులు, చంగల్‌రాయరెడ్డి, జై దేవయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!