EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

కరెంట్ బిల్లు కడతాం.. సర్వీస్ కట్ చేయొద్దు కుప్పం రైతుల ఆవేదన..  వాయిదా విధానానికి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి

📰 Generate e-Paper Clip

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే 31:

 

“కరెంట్ బిల్లు కడతాం సార్.. కట్టకుండా ఎగ్గొట్టం. ఒక్క సారిగా మొత్తం చెల్లించే పరిస్థితి లేదు. వాయిదాల్లో చెల్లించుకునే అవకాశం ఇవ్వండి. సర్వీస్ కట్ చేయొద్దు” అంటూ కుప్పం మండల రైతులు రెస్కో అధికారులను వేడుకుంటున్నారు. పెరిగిన సాగు ఖర్చులు, మార్కెట్‌లో ధరల అనిశ్చితి, చేతిలో నగదు లేకపోవడం వంటి కారణాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. కుప్పం మండలంలోని పలు గ్రామాలకు చెందిన ఉద్యాన పంటల రైతులు ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా టమాటా, పూల సాగు చేస్తున్న రైతులు డ్రిప్ సేద్యంపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారు. బోరు మోటార్ల ద్వారా నీటి సరఫరా కొనసాగాల్సి ఉండటంతో విద్యుత్ సరఫరా వారికి అత్యంత కీలకంగా మారింది. రైతుల కథనం ప్రకారం, పంట చేతికి వచ్చి మార్కెట్‌లో విక్రయించిన తర్వాతే డబ్బు అందుతుంది. కానీ అప్పటికే విద్యుత్ బిల్లుల గడువు ముగియడంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో బిల్లులు పూర్తిగా చెల్లించలేకపోతున్న రైతులు వాయిదాల రూపంలో చెల్లింపులు చేస్తున్నారు. అయినప్పటికీ కొన్ని చోట్ల విద్యుత్ కనెక్షన్లు నిలిపివేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఇటీవల ఒక రైతు సాగు చేస్తున్న టమాటా తోటకు సంబంధించిన విద్యుత్ కనెక్షన్ నిలిపివేయడంతో బోరు మోటారు పనిచేయకపోయిందని, రాత్రంతా నీరు అందక మొక్కలు వాడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశాడు. లక్షల రూపాయల పెట్టుబడితో సాగు చేసిన పంటలు నీరు లేక నష్టపోతే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నాడు. “మాకు కరెంట్ లేకపోతే పంట లేదు. పంట లేకపోతే ఆదాయం లేదు. ఆదాయం లేకపోతే బిల్లు చెల్లించే అవకాశం ఉండదు. మేము బిల్లులు ఎగ్గొట్టే వాళ్లు కాదు. ముందస్తు నోటీసు ఇచ్చి కొంత సమయం కల్పించాలి. వాయిదాల పద్ధతిలో బిల్లులు చెల్లించుకునే అవకాశం ఇవ్వాలి” అంటూ రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఉద్యాన పంటల సాగులో సమయానికి నీరు అందించడం అత్యంత కీలకమని రైతులు చెబుతున్నారు. ముఖ్యంగా డ్రిప్ సేద్యంలో ఒక్కరోజు నీటి సరఫరా నిలిచిపోయినా పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొంటున్నారు. బిల్లుల వసూళ్లు అవసరమే అయినప్పటికీ, రైతుల పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరుతున్నారు. కరెంట్ బకాయిల విషయంలో రైతులకు వాయిదాల సౌకర్యం కల్పించడం, ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం, పంటలు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై రెస్కో యాజమాన్యం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!