EPAPER
Thursday, August 20, 2026
Google search engine

గ్రామాలను వణికిస్తున్న గజరాజులు.. బందించాలని రైతుల డిమాండ్

📰 Generate e-Paper Clip

పలమనేరు రూరల్, చిత్తూరు ఎక్స్‌ప్రెస్, మే 23:

 

పలమనేరు రూరల్ మండలంలోని పెంగరగుంట పంచాయతీ పరిధిలో గత వారం రోజులుగా సంచరిస్తున్న రెండు గజరాజులు గ్రామస్తులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. మొసలిమడుగు, బండమీద ఇళ్లు, ఏటిగడ్డ, ఇందిరానగర్, చిన్నకుంట, కృష్ణాపురం, కాలవపల్లి, ఊసరపెంట తదితర గ్రామాల్లో ఏనుగులు పంటలను ధ్వంసం చేస్తూ గ్రామాలపై స్వైర విహారం చేస్తున్నాయి. ఏనుగులను అడవిలోకి మళ్లించేందుకు అటవీ శాఖ అధికారులు, ట్రాకర్లు నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి మరింత ఉగ్రరూపం దాల్చి రైతులను భయపెడుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. అడవి సమీపంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక సోలార్ ఫెన్సింగ్, కొత్తగా ఏర్పాటు చేసిన హ్యాంగింగ్ సోలార్ ఫెన్సింగ్‌లను అనేక చోట్ల ధ్వంసం చేసి పంటపొలాల్లోకి చొరబడుతున్నాయని వాపోయారు. గురువారం రాత్రి మొసలిమడుగు గ్రామానికి చెందిన మునస్వామి నాయుడు, చంద్రమ్మలకు చెందిన కోత దశలో ఉన్న మూడు ఎకరాల మామిడి తోటలోకి ప్రవేశించిన జంట ఏనుగులు కాయలను తిని, చెట్ల కొమ్మలను విరిచేసి భారీ నష్టం కలిగించాయి. తోట చుట్టూ వేసిన రాతి కూసాలను కూడా ధ్వంసం చేశాయి. అదే ప్రాంతంలో వెంకటేష్, సుబ్రహ్మణ్యం అనే రైతులు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న రెండు ఎకరాల చెరకు పంటను తొక్కిసలాడి నాశనం చేశాయి. రైతు సురేంద్ర నాయుడు మామిడి తోటలోకి ప్రవేశించి పంటలను ధ్వంసం చేయడంతో పాటు రాతికూసాలను విరిచేసినట్లు తెలిపారు. శుక్రవారం రాత్రి ఇందిరానగర్ కాలనీ సమీపంలోని కన్నయ్య అనే రైతుకు చెందిన కోత దశలో ఉన్న వరి పంటను ధ్వంసం చేసిన ఏనుగులు, పొలం చుట్టూ వేసిన ఫెన్సింగ్‌ను కూడా విరిచేశాయి. మరో ఒంటరి ఏనుగు ఏటిగడ్డ, కృష్ణాపురం గ్రామాల మీదుగా సంచరిస్తూ మామిడి, వరి, అరటి పంటలను నాశనం చేసింది. ఇటీవల పెంగరగుంట గ్రామానికి చెందిన వెంకటపతి గౌడు వ్యవసాయ భూమిలో ఏర్పాటు చేసిన పశువుల షెడ్డు వద్దకు వచ్చిన ఏనుగు వరి పంటను ధ్వంసం చేస్తూ పశువుల వద్దకు చేరుకోవడంతో కుటుంబ సభ్యులు భయంతో పరుగులు తీశారు. అలాగే మాజీ సర్పంచ్ భువనేశ్వరి, రైతు మునిరాజులు పంటలను కూడా ఏనుగులు ధ్వంసం చేసి బోరు మోటార్లు, పైపులు, రాతికూసాలను నాశనం చేశాయి. రాత్రివేళ పొలాల వద్ద నిద్రిస్తున్న రైతులు ఏనుగుల సంచారంతో ప్రాణభయంతో గడుపుతున్నారని తెలిపారు. పంటనష్టాలతో పాటు ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వారం రోజులుగా గ్రామాలను వణికిస్తున్న ఈ జంట ఏనుగులను వెంటనే బందించాలని రైతులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే కుంకీ ఏనుగుల ప్రాజెక్టు వద్ద ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!