EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

తోతాపురి మామిడి రైతుల ఆవేదన.. గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్

📰 Generate e-Paper Clip

చిత్తూరు,చిత్తూరు ఎక్స్‌ప్రెస్,మే 23:

 

2026 మామిడి సీజన్ ప్రారంభమై మే నెల ముగియనున్నా ఇప్పటివరకు జిల్లాలోని చాలావరకు గుజ్జు పరిశ్రమలు ప్రారంభం కాలేదని, మామిడి ధరలు కూడా నిర్ణయించలేదని చిత్తూరు జిల్లా మామిడి రైతు సంఘం అధ్యక్షుడు సీ. మునీశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మామిడి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో చిత్తూరు జిల్లా మామిడి రైతు సంఘం తరఫున జిల్లా కలెక్టర్‌కు 12 డిమాండ్లతో కూడిన వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. ప్రధానంగా మే నెలలోనే గుజ్జు ఫ్యాక్టరీలు ప్రారంభించడం, మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, జిల్లా స్థాయి అధికారులతో పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేయడం, ఉపాధి హామీ పథకాన్ని మామిడి రైతులకు అనుసంధానం చేయడం, క్రిమిసంహారక మందులను 50 శాతం సబ్సిడీతో అందించడం, మామిడి రైతు బజార్లు ఏర్పాటు చేయడం, మ్యాంగో బోర్డు ఏర్పాటు చేయడం వంటి డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అయితే సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రభుత్వం ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతు సంఘం ప్రతిపాదనలను పరిశీలించి మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. గత 2025 సంవత్సరంలో మామిడి ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. కొంతమంది రైతులు గుజ్జు పరిశ్రమలకు సరఫరా చేసిన మామిడికాయలకు ఇప్పటికీ డబ్బులు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం లిఖితపూర్వకంగా కిలోకు రూ.8 చెల్లించాలని ఆదేశించినప్పటికీ జిల్లాలో ఏ ఫ్యాక్టరీ కూడా ఆ మేరకు రైతులకు చెల్లించలేదని ఆరోపించారు. ప్రభుత్వం ఆదేశాలు అమలు కాకపోతే ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా అనే పరిస్థితి నెలకొందని రైతులు వాపోయారు. ఈ ఏడాది అయినా మంచి ధరలు వస్తాయని ఆశించిన రైతులు ప్రకృతి వైపరీత్యాల కారణంగా తీవ్ర నష్టాలు చవిచూశారని తెలిపారు. రాలిన మామిడికాయలను వ్యాపారుల వద్దకు తీసుకెళ్లినా కిలోకు రూ.1 నుంచి రూ.2 మాత్రమే ధర చెప్పడంతో రైతులు అమ్ముకోలేక రోడ్లపై, తోటల్లోనే వదిలివేస్తున్న పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని జిల్లా ప్రధాన కార్యదర్శి బంగారు మురళి ప్రభుత్వాన్ని కోరారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!