
కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే 05:
కుప్పం పట్టణంలో వెలసిన గ్రామ దేవత శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర మహోత్సవం మంగళవారం నాడు సాంప్రదాయబద్ధంగా చాటింపుతో ప్రారంభమైంది. గ్రామీణ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ జాతర నేటి నుండి 15 రోజులపాటు అంగరంగ వైభవంగా కొనసాగనుంది. జాతర ప్రారంభ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చాటింపు కార్యక్రమంతో జాతర ఆరంభమై, గ్రామంలో ఉత్సాహ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ పాల్గొని అమ్మవారి పూజా కార్యక్రమాలలో భక్తితో పాలుపంచుకున్నారు. అనంతరం ఆయన ఆలయ నిర్వాహకులతో మాట్లాడి జాతర ఏర్పాట్లపై వివరాలు తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని సూచించారు. జాతర సందర్భంగా ప్రతి రోజూ ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, ఊరేగింపులు, గ్రామీణ కళారూపాలు భక్తులను ఆకట్టుకోనున్నాయి. ఈ జాతర ద్వారా గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిఫలించడంతో పాటు, భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందుతోంది. జాతర విజయవంతం కావాలని గ్రామ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.



Recent Comments