
కుప్పం, చిత్తూరు ఎక్స్‌ప్రెస్, జూలై 18:
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన “స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర” కార్యక్రమంలో భాగంగా కుప్పం నియోజకవర్గంలో “స్వర్ణ కుప్పం–స్వచ్ఛ కుప్పం” ప్రత్యేక స్వచ్ఛత కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే ఈ కార్యక్రమాన్ని కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని చంద్రన్న వ్యవసాయ మార్కెట్ యార్డులో చేపట్టి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పి.ఎస్. మునిరత్నం, పీకేఎం-ఉడా చైర్మన్ డాక్టర్ బి.ఆర్. సురేష్‌బాబు పాల్గొని స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యకరమైన సమాజానికి, స్థిరమైన అభివృద్ధికి పునాదిగా నిలుస్తాయని అన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను తమ బాధ్యతగా భావించి భాగస్వామ్యం అయినప్పుడే ముఖ్యమంత్రి ఆకాంక్షించిన “స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర” లక్ష్యం సాకారమవుతుందని పేర్కొన్నారు. అభివృద్ధి అంటే ప్రజలకు కనిపించే మార్పని, ఆ మార్పుకు నాంది పరిశుభ్రతేనని వారు అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్‌కు అనుగుణంగా పరిశుభ్రమైన, అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సెల్వరాజ్, కుప్పం మాజీ ఎంపీపీ వెంకటేష్, క్లస్టర్ ఇన్చార్జిలు కన్నన్, సోమశేఖర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మున్సిపల్ సిబ్బంది, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని పరిసరాల పరిశుభ్రతకు తమ వంతు సహకారం అందించారు.


Recent Comments