
కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే11:
చిత్తూరుజిల్లా కుప్పం పట్టణంలో నిర్వహించనున్న తిరుపతి గంగమాంబ జాతర మహోత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ కోరారు. సోమవారం కడప అభివృద్ధి మండలి సమావేశమందిరంలో నిర్వహించిన ప్రత్యేక సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతర ఏర్పాట్లపై ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఆలయ పాలకవర్గ సభ్యులతో చర్చించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఈనెల 20వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు బీఎంకే రవిచంద్రబాబు మాట్లాడుతూ అమ్మవారి ఆలయ ఆస్తులు, ఆదాయాల విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. గత ఏడాది జాతర నిర్వహణకు మంజూరైన నిధుల మాదిరిగానే ఈసారి కూడా ఆర్థిక సహాయం అందించాలని కోరగా, అధికారులు సానుకూలంగా స్పందించారు. భక్తులకు తాగునీరు, మరుగు దొడ్లు, పరిశుభ్రత వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని అధికారులు సూచించారు. భద్రత,ట్రాఫిక్ నియంత్రణ, జంతు బలుల నియంత్రణపై ప్రత్యేక చర్యలు చేపడతామని డీఎస్పీ పార్థసారథి తెలిపారు. జాతర నిర్వహణ పనులను ముందస్తుగా పర్యవేక్షించి, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతం చేస్తామని ఎమ్మెల్సీ పేర్కొన్నారు.


Recent Comments