
సూళ్లూరుపేట,చిత్తూరు ఎక్స్ ప్రెస్, మే 17:
సూళ్లూరుపేట ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీచెంగాళమ్మ పరమేశ్వరి ఆలయం ఆదివారం భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. అమ్మవారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్దఎత్తున క్యూలైన్లలో బారులు తీరారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకో కుండా సూళ్లూరుపేట వలయాధికారి మురళీకృష్ణ పర్యవేక్షణలో సూళ్లూరుపేట ఉపపరిశీలకుడు అజయ్ కుమార్ పోలీసు సిబ్బందితో కలిసి విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని దొంగతనాలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు. మైకుల ద్వారా భక్తులకు నిరంతరం అవగాహన కల్పిస్తూ తమ విలువైన వస్తువులు, పర్సులు, చేతి దూరవాణులు, బంగారు ఆభరణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా లేదా ఏవైనా ఇబ్బందులు తలెత్తినా వెంటనే పోలీసులను సంప్రదించాలని తెలిపారు. “మీ రక్షణకు మేమున్నాం” అంటూ పోలీసు సిబ్బంది భక్తులకు ధైర్యం కల్పించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లు క్రమబద్ధీకరించారు. భక్తుల సౌకర్యార్థం పోలీసులు చేపట్టిన చర్యలపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.


Recent Comments