కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మార్చి 12:
కుప్పం నియోజకవర్గ పరిధిలోని కంగుంది – కుప్పం సంస్థానాన్ని గతంలో పరిపాలించిన రాజ కుటుంబ వారసత్వాన్ని గుర్తించాలని కోరుతూ కుప్పం నియోజకవర్గ వాల్మీకి కులస్తులు గురువారం ఎంఎల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ కి, అలాగే ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మరమ్మత్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా కుప్పం పట్టణ నడిబొడ్డున ఉన్న కోట్ల విలువైన స్థలాన్ని రాజా కె.జె.వి. వెంకటపతి నాయుడు పార్క్ కోసం కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ స్థలాన్ని చారిత్రక ప్రాధాన్యతతో అభివృద్ధి చేయాలని వాల్మీకి సంఘం ప్రతినిధులు కోరారు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కొన్ని ముఖ్యమైన సూచనలను వినతి పత్రంలో ప్రస్తావించినట్టు తెలిపారు. పార్క్‌కు “రాజా కె.జె.వి. వెంకటపతి నాయుడు పార్క్” అని పేరు పెట్టాలని, అక్కడ ఇప్పటికే ఉన్న రాజా వారి విగ్రహాన్ని మరమ్మత్తులు చేసి విగ్రహానికి షెల్టర్, మెట్లు ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా పార్క్ ముందు గేటు వద్ద మహర్షి వాల్మీకి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా పార్క్ లోపల గోడలపై కుప్పం సంస్థానం చరిత్రను ప్రతిబింబించే చిత్రాలు ఏర్పాటు చేయాలని, అలాగే స్టోన్ డిస్ప్లే ద్వారా తెలుగు, తమిళం, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో కుప్పం సంస్థానం చరిత్రను ప్రదర్శించాలని సూచించారు. వాల్మీకి సంఘం ప్రతినిధుల వినతిపై స్పందించిన ఎమ్మెల్సీ, కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ సానుకూలంగా స్పందించి విషయాన్ని పరిశీలించి, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సానుకూలంగా చర్యలు చేపడుతామని హామీ ఇవ్వడం ఆనందంగా ఉందని వాల్మీకి సంఘం కులస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాల్మీకి డైరెక్టర్ బాబు నాయుడు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జిమ్ దాము, కౌన్సిలర్ సురేష్ నాయుడు, మాజీ జెడ్పిటిసి వేటప్ప నాయుడు, ఎస్.ఆర్. చంద్ర, ప్రభాకర్, మునియప్ప, రాఘవ తదితరులు పాల్గొన్నారు.


Recent Comments