శ్రీకాళహస్తి, చిత్తూరు ఎక్స్ప్రెస్
శ్రీకాళహస్తికి సమీపంలో నిర్వహిస్తున్న తిరుపతి ఐఐటి
8వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి అశోక చక్ర అవార్డు గ్రహీత, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐఐటీ తిరుపతి బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్‌పర్సన్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ పాల్గొన్నారు. స్నాతకోత్సవంలో 457 మంది విద్యార్థులకు వివిధ కోర్సుల్లో డిగ్రీలు, డిప్లొమాలు ప్రదానం చేశారు. 18 మంది ప్రతిభావంతులకు పతకాలు, బహుమతులు అందజేశారు. కంప్యూటర్ సైన్స్ విద్యార్థి తంగుటూరి మోక్షిత్ రెడ్డికి ప్రెసిడెంట్స్ గోల్డ్ మెడల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విద్యార్థి సుభం మొహంతికి గవర్నర్స్ ప్రైజ్ లభించింది. ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కె.ఎన్. సత్యనారాయణ మాట్లాడుతూ సంస్థ విద్య, పరిశోధన, ఆవిష్కరణల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ, రోబోటిక్స్, స్పేస్ సైన్స్ తదితర ఆధునిక రంగాల్లో పరిశోధనలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.సజ్జన్ జిందాల్ మాట్లాడుతూ పట్టభద్రులు సాంకేతిక నైపుణ్యంతో పాటు నిజాయితీ, బాధ్యతతో దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు. శుభాంశు శుక్లా మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు తమను తాము తీర్చిదిద్దుకోవాలని, కొత్త అవకాశాలను గుర్తించి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.




Recent Comments