ఎస్ఆర్ పురం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 22:
కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలో జనగణన సర్వే నిర్వహించనున్నట్లు ఎస్ఆర్ పురం మండల తాసిల్దార్ లోకనాథ్ పిలై తెలిపారు. బుధవారం మండలంలోని ఇండో జర్మన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జనగణన కోసం ఎంపికైన ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జనగణన సర్వే 2021లో నిర్వహించాల్సి ఉండగా, కోవిడ్ ప్రభావంతో వాయిదా పడిందని, ప్రస్తుతం తిరిగి ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సర్వేలో ప్రతి వ్యక్తికి సంబంధించిన సమగ్ర వివరాలు సేకరించనున్నట్లు తెలిపారు. ఒక్కో ఇంటి నిర్మాణ విధానం, ఇల్లు పక్కా లేదా కాచా, గృహ సౌకర్యాలు, గదుల సంఖ్య, మరుగుదొడ్డి వంటి అంశాలపై మొత్తం 31 రకాల ప్రశ్నలతో డిజిటల్ విధానంలో సర్వే చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ జనగణన రెండు దశల్లో జరుగుతుం దని,మొదట గృహాల వివరాలు,తర్వాత జనాభా వివరాలు సేకరించనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరూ సర్వేకు సహకరించాలని కోరారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఇంటివద్ద ఉన్న యువత,ఉద్యోగస్తులు కూడా సహకరిం చాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి శిక్షణాధికారులు హిమాచల పతి, శివలింగం, గ్రామ రెవెన్యూ అధికారి చంద్రబాబు, సర్వే సిబ్బంది జ్ఞానేంద్ర, అఖిల్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.


Recent Comments