EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

ఏపీలో సీజీహెచ్‌ఎస్ వైద్య సేవల విస్తరణకు కేంద్రం చర్యలు రాష్ట్రంలో 46 ఆసుపత్రులకు గుర్తింపు – ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు

📰 Generate e-Paper Clip

చిత్తూరు/న్యూఢిల్లీ,చిత్తూరు ఎక్స్  ప్రెస్,జూలై24:

 

కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్) పరిధిలో ఆంధ్రప్రదేశ్‌లో వైద్య సేవలను మరింత విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు దగ్గుమళ్ల ప్రసాదరావు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మొత్తం 46 ఆసుపత్రులను సీజీహెచ్‌ఎస్ హెల్త్‌కేర్ ఆర్గనైజేషన్లుగా (HCOs) ఎంపానెల్ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించిందని ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావు జాదవ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారని తెలిపారు. ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గనిర్దేశంలో రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల సాధన కోసం పార్లమెంట్‌లో పలు అంశాలను ప్రస్తావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మంత్రి అందించిన వివరాల ప్రకారం విశాఖపట్నం జిల్లాలో అత్యధి కంగా 20 ఆసుపత్రులు సీజీహెచ్‌ఎస్ పరిధిలో గుర్తింపు పొందగా, ఎన్టీఆర్ జిల్లాలో 11, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 5, తూర్పుగోదావరి జిల్లాలో 3, గుంటూరు జిల్లాలో 3,కృష్ణా జిల్లాలో 2,తిరుపతి జిల్లాలో 2 ఆసుపత్రులు ఎంపానెల్ అయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 46 ఆసుపత్రుల్లో సీజీహెచ్‌ఎస్ లబ్ధిదారులకు వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా సీజీహెచ్‌ఎస్ కింద పెన్షనర్లు మరియు ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్ (PORB) లబ్ధిదారుల వైద్య వ్యయాలు గత ఐదేళ్లలో క్రమంగా పెరిగినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. 2021–22లో రూ.2,741.17 కోట్లు, 2022–23లో రూ.4,630.68 కోట్లు, 2023–24లో రూ.4,282.72 కోట్లు, 2024–25లో రూ.5,645.97 కోట్లు, 2025–26లో రూ.6,144.17 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. వైద్య రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌ల(ఎంఆర్సీ) స్థితిని సీజీహెచ్‌ఎస్ వెబ్ పోర్టల్ లేదా ‘మై సీజీహెచ్‌ఎస్ 2.0’ మొబైల్ యాప్ ద్వారా క్లెయిమ్ ఐడీ ఆధారంగా లబ్ధిదారులు ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే క్లెయిమ్‌ల పరిష్కారంలో ఆలస్యాలను తగ్గించేందుకు డిజిటల్ డాష్‌బోర్డులను ఏర్పాటు చేసినట్లు, సీజీహెచ్‌ఎస్ గ్రీవెన్స్ పోర్టల్, సీపీగ్రామ్స్ (CPGRAMS), టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్, అధికారిక ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేసి పరిష్కారం పొందే అవకాశం కల్పించినట్లు కేంద్ర మంత్రి వెల్లడించిన విషయాన్ని ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు తెలిపారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!