
చిత్తూరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్, మే09:
చిత్తూరు జిల్లాలో ఏనుగుల బారి నుంచి పంటలతో పాటు రైతుల ప్రాణాలకు పూర్తి రక్షణ కల్పించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఉమాపతి నాయుడు ప్రభుత్వాన్ని కోరారు. అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న గ్రామాల్లో ఏళ్ల తరబడి ఏనుగుల సమస్యతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో అనేక మంది రైతులు వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్నారని, అయితే ఏనుగులు, అడవి పందులు, కోతుల బెడదతో పంటలు తీవ్రంగా నష్టపోతున్నాయని పేర్కొన్నారు. రైతులు లక్షల రూపాయలు అప్పులు చేసి సాగు చేస్తున్న పంటలను అడవి జంతువులు ధ్వంసం చేయడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నా యని ఆవేదన వ్యక్తం చేశారు. ఏనుగులు పంటలను నాశనం చేయడమే కాకుండా గ్రామాల్లోకి చొరబడి మూగజీవాలను కూడా చంపేస్తున్నాయని తెలిపారు. వాటిని తరిమేందుకు ప్రయత్నించే అటవీ సిబ్బంది, గుర్తింపు సిబ్బంది, రైతులపై కూడా ఏనుగులు దాడులు చేస్తున్నాయని, ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టకపోవడం బాధాకరమని విమర్శించారు. ఏనుగుల భయంతో కొన్ని ప్రాంతాల్లో రైతులు వ్యవసాయం మానేసి భూములను బీడుగా వదిలేస్తున్నారని తెలిపారు. అటవీ ప్రాంతాలకు సమీపంలోని వ్యవసాయ భూముల వద్ద సౌర కంచెలు ఏర్పాటు చేస్తే ఏనుగులతో పాటు అడవి పందుల బెడదను కూడా చాలా వరకు నివారించవచ్చని సూచించారు. ప్రస్తుతం ప్రభుత్వం కుంకి ఏనుగుల ప్రాజెక్టుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ రైతులకు ఆశించిన ప్రయోజనం కలగడం లేదని అన్నారు. పంటలు లక్షల్లో నష్టపోతున్నప్పటికీ ప్రభుత్వం ఇస్తున్న పరిహారం చాలా తక్కువగా ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. ప్రస్తుత సాగు ఖర్చులు భారీగా పెరిగిన నేపథ్యంలో పంటల మార్కెట్ ధరలకు అనుగుణంగా నష్టపరిహారాన్ని కనీసం మూడింతలు పెంచాలని డిమాండ్ చేశారు. రైతులు ఇద్దరు, ముగ్గురు కలిసి తమ భూములకు సౌరకంచెలు ఏర్పాటు చేసుకునేలా వంద శాతం రాయితీతో ప్రభుత్వం ప్రత్యేక పథకం అమలు చేయాలని కోరారు. ఈ చర్యల ద్వారా పంట నష్టాలతో పాటు ప్రాణ నష్టాలను కూడా తగ్గించవచ్చని తెలిపారు. రైతుల భద్రత, వ్యవసాయ పరిరక్షణకు ప్రభుత్వం శాశ్వత చర్యలు తీసుకుంటే రైతులకు మేలు జరుగడమే కాకుండా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఉమాపతి నాయుడు పేర్కొన్నారు.


Recent Comments