చిత్తూరు,చిత్తూరు ఎక్స్ప్రెస్, అక్టోబర్ 20:
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా ఏఆర్ పరేడ్ మైదానంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ ఆధ్వర్యంలో ఆయుధ పూజను ఘనంగా నిర్వహించారు. పోలీసు ఆయుధాగారం, జిమ్, పోలీసు అసోసియేషన్ కార్యాలయంతో పాటు వివిధ విభాగాల్లో పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఆయుధాలను క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా వినియోగిస్తూ ప్రజలకు భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. సమాజంలో శాంతి, సామరస్యం నెలకొని ప్రజలు సుఖసంతోషాలతో జీవించేలా పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. ఆయుధ పూజ కార్యక్రమాన్ని సమన్వయంతో నిర్వహించిన అధికారులను, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. విజయదశమి పర్వదినాన్ని జిల్లా ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ పోలీసు శాఖ తరఫున దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాన్ కేడర్ ఎస్పీ ఎస్.ఆర్. రాజశేఖర రాజు, చిత్తూరు సబ్ డివిజన్ డీఎస్పీ జె. వెంకటనారాయణ, ఏఆర్ డీఎస్పీలు మహబూబ్ బాషా, రామకృష్ణ, పట్టణ ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



Recent Comments