EPAPER
Sunday, October 18, 2026
Google search engine

పర్యాటకాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత రెడ్డిగుంట చెరువు అభివృద్ధి పనులకు భూమిపూజ CSR, P4, కమ్యూనిటీ భాగస్వామ్యంతో చెరువుల సంరక్షణ ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, గురజాల జగన్‌మోహన్

📰 Generate e-Paper Clip

చిత్తూరు, చిత్తూరు ఎక్స్ ప్రెస్ , సెప్టెంబర్ 28:

 

జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ చెరువుల అభివృద్ధి, సుందరీకరణ పనులను చేపడుతున్నట్లు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. చిత్తూరు కలెక్టరేట్ సమీపంలోని రెడ్డిగుంట చెరువులో రామోజీ ఫౌండేషన్ సీఎస్‌ఆర్ నిధులతో చేపట్టనున్న సుందరీకరణ, అభివృద్ధి పనులకు సోమవారం ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి కలెక్టర్ సుమిత్ కుమార్ భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు మాట్లాడుతూ రెడ్డిగుంట చెరువు అభివృద్ధి పనులు ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం నేటి అవసరమన్నారు. రామోజీ ఫౌండేషన్ వంటి సంస్థలు సీఎస్‌ఆర్ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. జిల్లాభివృద్ధికి కేంద్రం నుంచి అవసరమైన సహకారం అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని చెరువులను సంరక్షించడంతో పాటు వాటి పరిసరాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు CSR, P4, కమ్యూనిటీ పార్టిసిపేషన్‌ను ప్రోత్సహిస్తామని తెలిపారు. ప్రభుత్వ వనరులకు ప్రజల అవసరాలు అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయవచ్చన్నారు. జిల్లాలోని చెరువుల అభివృద్ధికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి రెండు, మూడు నెలల్లో సమగ్ర ప్రణాళిక రూపొందిస్తామని వెల్లడించారు.చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ చెరువులు మన సంస్కృతిలో అంతర్భాగమని అన్నారు. వాటి సుందరీకరణతో స్థానికులకు ఆహ్లాదకర వాతావరణం ఏర్పడటంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని తెలిపారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ మాట్లాడుతూ P4 విధానంతో ప్రజా ప్రయోజన కార్యక్రమాలను వేగంగా చేపట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. చెరువుల అభివృద్ధి ద్వారా భూగర్భ జలాలు పెరిగి చిత్తూరు నగరంలో తాగునీటి సమస్యను తగ్గించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, చూడా చైర్‌పర్సన్ కట్టా కటారి హేమలత, ప్రముఖ పారిశ్రామికవేత్త శైలజ, మాజీ మేయర్ ఆముద, జిల్లా అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!