
శాంతిపురం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, సెప్టెంబర్ 17:
కడ, కుప్పం ఆధ్వర్యంలో శాంతిపురం మండలంలో ప్రతిరోజూ నిర్వహిస్తున్న ఇంటింటి చెత్త సేకరణ (డోర్ టు డోర్) కార్యక్రమంతో పారిశుద్ధ్యం మెరుగుపడి సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పడుతున్నాయని డివిజినల్ అభివృద్ధి అధికారి కుప్పం నరసింహనాయుడు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి శాంతిపురం ఏపీఆర్ కుమార్ తెలిపారు. కోతిగుట్లపల్లి, వెంకటేపల్లి గ్రామాల్లో వైద్య సిబ్బందితో కలిసి అధికారులు ప్రజలతో ముఖాముఖి నిర్వహించి చెత్త సేకరణపై అవగాహన కల్పించారు. 2026 నుంచి ఎలక్ట్రిక్ ఆటోలు, క్లాప్ మిత్రాల ద్వారా ఇంటింటి చెత్త సేకరణ చేపడుతున్నామని, GPS, సీసీ కెమెరాల ద్వారా వాహనాల పనితీరును పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. రోజుకు సుమారు 2,000 కిలోల వ్యర్థాలను షెడ్లకు తరలించి కంపోస్ట్ ఎరువుగా తయారు చేస్తున్నట్లు వివరించారు. పారిశుద్ధ్య చర్యల కారణంగా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధుల కేసులు నమోదు కాలేదని వైద్య సిబ్బంది, గ్రామస్తులు వెల్లడించారు. ప్రజల సహకారంతో పారిశుద్ధ్య కార్యక్రమాలను మరింత పకడ్బందీగా నిర్వహించి వ్యాధులకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ ఉషారాణి, ప్రసాద్, డిప్యూటీ ఎంపీడీవో రవి నాయక్, పంచాయతీ అభివృద్ధి అధికారులు స్వాతి, హరీష్, జయరామిరెడ్డి, యూనిట్ ఇన్చార్జి, బూత్ కన్వీనర్ సురేష్, నాయకులు బాబు, రాజారెడ్డి, వైద్య సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.


Recent Comments