EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

గైడ్ — చరిత్రకు వెలుగుదీపం —- మంజుల పత్తిపాటి

📰 Generate e-Paper Clip

యాదాద్రి భువనగిరి, చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఆగస్టు 16:

 

రాజుల కాలం వెతుకుతూ,

శిల్పాల నిశ్శబ్దంలో

చరిత్ర స్వరాన్ని వినిపిస్తూ—

ఇది ఎవరు కట్టారు,ఎప్పుడు నిర్మించారు

అనే మన ప్రశ్నల వర్షాలకి…

సమాధానాల దీపమై నిలుస్తాడు గైడ్..!

చరిత్రను రాజులు సృష్టించి ఉండొచ్చు…

కానీ ఆ చరిత్రకు మళ్లీ మళ్లీ ఊపిరి పోసేది

అతని లాంటి గొంతులే…

అతను కేవలం గైడ్ కాదు…

కాలం మూసిన తలుపులకు

తాళం తీసే మనిషి….

మౌనంగా ఉన్న రాళ్లకు

మాటలు నేర్పే మనిషి…..

మరచిపోతున్న తరాలకు

గతాన్ని పరిచయం చేసే మనిషి….

చరిత్ర పుటల్లో అతని పేరు లేకపోవచ్చు…

కానీ ఆ పుటలు తెరుచుకున్న ప్రతిసారీ

వినిపించే స్వరాల్లో

అతని గొంతు తప్పక ఉంటుంది, అతనే గైడ్..!

ఎండ మండినా, వాన కురిసినా…

ఇంట్లో పిల్లలు ఆకలి కేకలతో అలమటిస్తున్నా…

వచ్చిన సందర్శకులకు చిరు నవ్వుతో

రాజుల వైభవం వారి చరిత్ర చెబుతు

తన కళ్లలో కన్నీళ్లు దాచుకుని

వారి కళ్లలో ఆశ్చర్యాన్ని నింపుతాడు..!

తన జీవితంలో లేని సౌభాగ్యాన్ని

చరిత్రలోని రాజుల జీవితాలుగా

ఇతరులకు చూపిస్తాడు..!

చరిత్ర పుస్తకాల్లో లేకపోవచ్చు…

కానీ అతని గొంతు లేకపోతే

ఆ చరిత్రకు ప్రాణం ఉండదు అని గుర్తుంచుకో..!

అతని అడుగులు ఆగిపోతే

ఒక కథ ఆగిపోతుంది…

అతని గొంతు మూగబోతే

ఒక చరిత్ర మూగబోతుంది…

అతని జ్ఞాపకం చెరిగిపోతే

ఒక తరం తన గతాన్ని కోల్పోతుంది,

కాబట్టి…

రాజులను గుర్తుపెట్టుకునే ముందు

వారి కథలు చెప్పే ఈ మనుషులను గుర్తుపెట్టుకో..!

కోటలను చూసి ఆశ్చర్యపడే ముందు

ఆ కోటల చరిత్రను

మన కళ్లకు చూపించే ఆ గొంతును గౌరవించు..!

తన గుడిసెలో వెలుగు తక్కువైనా

గత చరిత్ర వైభవాన్ని

వేలాది మనసుల్లో వెలిగించే

ఆ గొంతును గౌరవించు..!

వారికి మంచి రోజులు రావాలని కోరుకుంటూ…

మనం రాజుల కోటలను, దేవాలయాలను చూడడానికి వాటి చరిత్ర తెలుసుకోవడానికి ఖర్చులకు భయపడకుండా ఎంతో దూరం నుండి వస్తాం గైడ్ చెప్పింది విని అతను సంతోష పడేవిధంగా డబ్బులు ఇద్దాం.

రచన :శ్రీమతి మంజుల పత్తిపాటి (కవయిత్రి )

చరవాణి 9347042218

మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!