
కుప్పం, చిత్తూరు ఎక్స్ ప్రెస్ , ఆగస్టు15:
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కుప్పం పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, సంస్థల వద్ద జాతీయ పతాకాలను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. విద్యార్థుల దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పండుగ వాతావరణం నెలకొంది.
కాడ కార్యాలయంలో వేడుకలు
కుప్పం ప్రాంత అభివృద్ధి సంస్థ (కాడ) కార్యాలయంలో ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మట్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సిబ్బందితో కలిసి జెండా వందనం చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తి, జాతీయ సమైక్యతను కాపాడాలని, దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ఆయన సూచించారు.
పురపాలక సంఘంలో జెండా వందనం
కుప్పం పురపాలక సంఘం కార్యాలయంలో కమిషనర్ శ్రీనివాసరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పట్టణ పారిశుధ్యం, మౌలిక వసతుల మెరుగుదలకు సమష్టిగా పనిచేయాలని, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.
ఆర్టీసీ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు
ఏపీఎస్ఆర్టీసీ కుప్పం డిపోలో సంస్థ ఉపాధ్యక్షుడు పీఎస్ మునిరత్నం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. జెండా వందనం అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రయాణికులకు సురక్షితమైన, మెరుగైన రవాణా సేవలు అందిస్తూ సంస్థ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని ఆయన సూచించారు.
గ్రామాల్లోనూ సందడి
మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, గ్రామ సచివాలయాలు, ఇతర కార్యాలయాల వద్ద జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. విద్యార్థుల దేశభక్తి గీతాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రజలు, యువత, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తిని చాటుకోవడంతో కుప్పం మండల వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ సందడి నెలకొంది.



Recent Comments