EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

ఒంటరి ఏనుగు బీభత్సం.. చర్యలు ఎప్పుడూ? పంటలు, బోరు మోటార్లు, ఉద్యాన పంటలు ధ్వంసం.. పొలాల వద్ద ఇళ్లు, షెడ్లకూ నష్టం

📰 Generate e-Paper Clip

పలమనేరు, చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఆగస్టు13:

 

చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో ఒంటరి ఏనుగు సంచారం రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలోని పంట పొలాల్లోకి చొరబడుతున్న ఏనుగు వరి తదితర పంటలను తొక్కి నాశనం చేయడంతో పాటు బోరు మోటార్లు, వ్యవసాయ పరికరాలు, ఉద్యాన పంటలు, చెట్లను ధ్వంసం చేస్తోంది. పొలాల వద్ద ఉన్న ఇళ్లు, పురుగుల షెడ్లు, పశువుల షెడ్లను సైతం లెక్కచేయకుండా ధ్వంసం చేస్తున్నా అటవీశాఖ అధికారులు శాశ్వత చర్యలు చేపట్టడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగు సంచారంతో రాత్రివేళల్లో పొలాలకు వెళ్లాలంటేనే రైతులు భయపడుతున్నారు. ఇటీవల మొగిలి సమీపంలో ఎక్స్‌ప్రెస్‌ హైవే పనుల్లో పనిచేస్తున్న మణీసింగ్‌పై ఒంటరి ఏనుగు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటనతో ప్రజలు, రైతుల్లో భయాందోళనలు మరింత పెరిగాయి. ఒకవైపు మనుషులపై దాడులు చేస్తూ, మరోవైపు గ్రామాల్లోకి చొరబడి పంటలు, వ్యవసాయ పరికరాలను ధ్వంసం చేస్తుండటంతో ఏనుగు బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

మూడు సార్లు లేత వరి పంట ధ్వంసం

మొసలిమడుగు గ్రామానికి చెందిన రుద్రయ్య నాయుడు రెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం రాత్రి పొలంలోకి ప్రవేశించిన ఒంటరి ఏనుగు లేత వరి పంటను తిని, తొక్కి తీవ్రంగా నష్టపరిచింది. ఇప్పటికే ఇదే పంటను ఏనుగు మూడుసార్లు ధ్వంసం చేసిందని రైతు తెలిపారు. గత ఐదేళ్లుగా ఇదే ప్రాంతంలో ఏనుగు పలుమార్లు సంచరిస్తూ వరి పంటలను పూర్తిగా నష్టపరిచిందని, అయినప్పటికీ ఇప్పటివరకు అటవీశాఖ అధికారులు ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం అందించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అదే ఏనుగా.. మరో ఏనుగా?

గతంలో ఇదే ప్రాంతంలో సంచరిస్తున్న ఒంటరి ఏనుగును బంధించినట్లు అటవీశాఖ అధికారులు ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం మళ్లీ అదే ప్రాంతంలో ఒంటరి ఏనుగు సంచరిస్తుండటంపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సంచరిస్తున్నది అదే ఏనుగా? లేక మరో ఏనుగా? అనే విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.

సోలార్ ఫెన్సింగ్ ఎక్కడ?

ఏనుగు సంచారాన్ని అరికట్టేందుకు ఇందిరానగర్ కాలనీ నుంచి కాలవపల్లి మీదుగా చెత్తపెంట గ్రామం వరకు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని రైతులు, గ్రామస్తులు పలుమార్లు అధికారులను కోరినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తే ఏనుగులు పంట పొలాల్లోకి ప్రవేశించకుండా కొంతవరకు అడ్డుకోవచ్చని వారు చెబుతున్నారు.

నష్టపరిహారం అందించాలని డిమాండ్

ఏనుగు సంచార ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ప్రజలు, రైతుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. పంటలు, బోరు మోటార్లు, వ్యవసాయ పరికరాలు, ఉద్యాన పంటలకు జరిగిన నష్టాన్ని తక్షణమే అంచనా వేసి బాధిత రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. మనుషులపై దాడులు.. పంటలకు నష్టం.. బోరు మోటార్ల ధ్వంసం.. ఇలా వరుస ఘటనలు జరుగుతున్నా అటవీశాఖ అధికారులు ఇంకా ఎంతకాలం వేచి చూస్తారు? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పెండింగ్‌లో ఉన్న సోలార్ ఫెన్సింగ్ పనులను వెంటనే చేపట్టి, ఒంటరి ఏనుగు బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలని పలమనేరు రూరల్ మండలంలోని పలు గ్రామాల రైతులు, ప్రజలు కోరుతున్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!