
ఎస్ఆర్ పురం, చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఆగస్టు 02:
ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసే నాయకుడు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం. థామస్ అని ఏపీ ఎంఎస్ఎంఈ డైరెక్టర్ చిన్నబాబు కొనియాడారు. ఎస్ఆర్ పురం మండలం పద్మాపురం గ్రామంలో సోమవారం నిర్వహించిన విలేజ్ క్లినిక్ ప్రారంభోత్సవం, అలాగే “మీ భూమి–మీ హక్కు” రాజముద్ర కలిగిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం. థామస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నబాబు మాట్లాడుతూ, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలు, కార్యకర్తలు భయాందోళనల మధ్య జీవించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పాలన సాగుతోందన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ థామస్ రాత్రి వేళల్లో సైతం ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించే నాయకుడని ప్రశంసించారు. ఇలాంటి ప్రజానాయకుడికి కార్యకర్తలు, నాయకులు పూర్తి సహకారం అందించాలని సూచించారు. పద్మాపురం గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం. థామస్‌కు గ్రామస్థులు ఘన స్వాగతం పలికి అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. అనంతరం ఆయనను, ఏపీ ఎంఎస్ఎంఈ డైరెక్టర్ చిన్నబాబును గ్రామస్థులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు, మాజీ మండల అధ్యక్షులు రుద్రప్ప నాయుడు, చిట్టిబాబు నాయుడు, భాస్కర్ నాయుడు, పద్మాపురం టీడీపీ యువ నాయకుడు వాసు నాయుడు, గజేంద్ర నాయుడు, శ్యామ్ నాయుడు, జ్యోతి నాయుడు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.


Recent Comments