శ్రీకాళహస్తి, చిత్తూరు ఎక్స్‌ప్రెస్
శ్రీకాళహస్తి పట్టణంలోని స్వర్ణముఖి నది తీరంలో వెలసిన హజరత్ జూమ్ లేషా పీర్ దర్గా అభివృద్ధికి ప్రముఖ గాయకుడు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు గ్రహీత గజల్ శ్రీనివాస్ రూ.1 లక్షల విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దర్గా ఆవరణలో భక్తుల సౌకర్యార్థం రూఫ్‌టాప్ నిర్మాణం, మరుగుదొడ్లు, భక్తులు వంటలు చేసుకునేందుకు ప్రత్యేక స్థలం ఏర్పాటు చేయడానికి సుమారు రూ.10 లక్షల వ్యయం అవుతుందని తెలిపారు. ఈ అభివృద్ధి కార్యక్రమానికి తన వంతు సహాయంగా తొలి విడతగా రూ.1 లక్ష విరాళాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు.మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ దర్గా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ చేయూత నందించాలని ఆయన పిలుపునిచ్చారు. అందరి సహకారంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే ఈ కార్యక్రమం విజయవంతం మవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దర్గా పెద్దలు సయ్యద్ అహ్మద్, సయ్యద్ బాబా ఫరీద్, ఉరుసు కమిటీ సభ్యులు నాగేశ్వరరావు, రాజేశ్వరరావు, ఉదయ్, జమ్రుద్దీన్ భాష తదితరులు పాల్గొన్నారు.



Recent Comments