
చిత్తూరు, చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూలై 21:
రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు ప్రతి ద్విచక్ర వాహనదారుడు ఐఎస్‌ఐ (ISI) ప్రమాణాలు కలిగిన నాణ్యమైన హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించాలని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఐపీఎస్ పిలుపునిచ్చారు. హెల్మెట్ అనేది జరిమానా నుంచి తప్పించుకునే సాధనం కాదని, ప్రాణాలను కాపాడే రక్షణ కవచమని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో జనవరి నుంచి ఇప్పటి వరకు హెల్మెట్ ధరించకపోవడం వల్ల 106 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయని, వీటిలో 61 మంది ద్విచక్ర వాహనదారులు, ప్రయాణికులు మృతి చెందగా, మరో 45 మంది గాయపడినట్లు ఎస్పీ వెల్లడించారు. రోడ్డు ప్రమాదం ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందో ఊహించలేమని, ప్రమాద సమయంలో తలకు తగిలే తీవ్ర గాయాల నుంచి రక్షించగలిగేది హెల్మెట్ మాత్రమేనని పేర్కొన్నారు. కేంద్ర మోటారు వాహన చట్టం ప్రకారం ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చునే వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆయన గుర్తు చేశారు. హెల్మెట్ ధరించకపోవడం చట్ట ఉల్లంఘన మాత్రమే కాకుండా కుటుంబాలను విషాదంలోకి నెట్టే నిర్లక్ష్య చర్య అని అన్నారు. రోడ్డు భద్రతను బలోపేతం చేయడానికి చిత్తూరు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవులు, వాహన తనిఖీలతో పాటు పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలు, గ్రామాలు, పట్టణాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల్లో బాధ్యతాయుతమైన డ్రైవింగ్ అలవాట్లు పెంపొందించేందుకు నిరంతరం ప్రచార కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. హెల్మెట్ కొనుగోలు చేయడం ఖర్చు కాదని, అది కుటుంబానికి ఇచ్చే భద్రత అని ఎస్పీ పేర్కొన్నారు. ఇంటి నుంచి బయలుదేరే ప్రతి ఒక్కరూ “హెల్మెట్ ఉందా?” అని తమను తాము ప్రశ్నించుకోవాలని సూచించారు. యువత వేగానికి కాకుండా భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా రక్షించవచ్చని తెలిపారు. “జరిమానా తప్పించుకోవడానికి కాదు… ప్రాణాలు కాపాడుకోవడానికి హెల్మెట్ ధరించండి. మీ కోసం ఎదురుచూస్తున్న కుటుంబం కోసం ప్రతి ప్రయాణంలో హెల్మెట్‌ను అలవాటుగా మార్చుకోండి” అని జిల్లా ప్రజలకు ఎస్పీ తుషార్ డూడి పిలుపునిచ్చారు.


Recent Comments