EPAPER
Thursday, August 20, 2026
Google search engine

జూలై 14లోపు ఓటరు వివరాల డిజిటలైజేషన్ పూర్తి లక్ష్యం జిల్లాలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ వేగవంతం – జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

📰 Generate e-Paper Clip

చిత్తూరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్ ,జూలై 10:

 

జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జూలై 14లోపు ఓటరు వివరాల డిజిటలైజేషన్ పూర్తి చేయడానికి అన్ని చర్యలు చేపట్టామని చెప్పారు. ఈ ప్రక్రియలో బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు), బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, గత నెల 15వ తేదీ నుంచి బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల ఎన్యూమరేషన్ నిర్వహిస్తున్నారని తెలిపారు. సేకరించిన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. జిల్లాలో మొత్తం 13,40,126 మంది ఓటర్లకు గాను 13,39,675 ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయగా, ఇది 99.97 శాతం పూర్తయిందన్నారు. ఇప్పటివరకు 10,67,946 ఫారాలు డిజిటలైజ్ చేయగా, మొత్తం పురోగతి 79.69 శాతానికి చేరిందని వెల్లడించారు. నియోజకవర్గాల వారీగా డిజిటలైజేషన్ పురోగతిలో నగరి 84.02 శాతం, గంగాధర నెల్లూరు 81.37 శాతం, పలమనేరు 80.34 శాతం, పూతలపట్టు 79.72 శాతం, చిత్తూరు 76.71 శాతం, కుప్పం 76.18 శాతం నమోదు చేసినట్లు తెలిపారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు 19,701 మంది మరణించిన ఓటర్లు, 8,344 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, 7,263 మంది ఇతర ప్రాంతాల్లో ఓటరుగా నమోదైన వారు, 789 మంది గైర్హాజరు, 108 ఇతర కేసులు గుర్తించామని తెలిపారు. మొత్తం 36,205 మంది (2.70 శాతం) అన్‌కలెక్టబుల్‌గా గుర్తించబడ్డారని, తుది పరిశీలన అనంతరం ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. జిల్లాలో 1,511 మంది బీఎల్ఓలు పనిచేస్తుండగా, గత 24 గంటల్లోనే 42,920 ఫారాలను డిజిటలైజ్ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రతి వారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామని, ఈ నెల 14న మరో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే జూలై 21న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ప్రజలు ఎన్నికల సంఘం అందిస్తున్న ECINET మొబైల్ యాప్ లేదా voters. eci.gov.in వెబ్‌సైట్‌లోని “Book a Call with BLO” సేవను వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. కాల్ బుక్ చేసిన 48 గంటల్లో సంబంధిత బీఎల్ఓ సంప్రదించి అవసరమైన సేవలు అందిస్తారని తెలిపారు. ఓటరు నమోదు, పేరు, వయస్సు, చిరునామా తదితర వివరాల్లో మార్పులు, సవరణలు చేయించుకోవాల్సిన అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అధికారులు, బీఎల్ఓలు, ఈఆర్వోలు సమన్వయంతో పనిచేస్తున్నారని, ప్రజల సహకారంతో నిర్ణీత గడువులోగా ఎస్‌ఐఆర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!