
శ్రీకాళహస్తి,చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూన్ 04:
శ్రీకాళహస్తి ఆంధ్రప్రదేశ్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీ సీడ్స్) అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేయడాన్ని టి.యు.సి.సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జేవీ నరసింహమూర్తి హర్షం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తి ఏపీ సీడ్స్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు చేపడతామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ప్రకటించడం పట్ల ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నరసింహమూర్తి మాట్లాడుతూ 1972లో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాభివృద్ధి, నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి లక్ష్యంగా ఏపీ సీడ్స్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిందన్నారు. ఒకప్పుడు వేల టన్నుల విత్తనాల ఉత్పత్తి, ప్రాసెసింగ్ యూనిట్లు, ఆధునిక యంత్ర పరికరాలతో సంస్థ విశేషంగా అభివృద్ధి చెందిందని గుర్తుచేశారు. కాలక్రమేణా ప్రైవేట్ విత్తన సంస్థల పెరుగుదల, ప్రభుత్వాల నిర్లక్ష్యంతో కార్పొరేషన్ బలహీనపడిందన్నారు. కార్మికుల సమస్యలు, సంస్థ అభివృద్ధి అంశాలపై టి.యు.సి.సి రాష్ట్ర బృందం పలుమార్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, కార్పొరేషన్ అధికారులు, కార్మిక శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించిందన్నారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీడ్స్ అభివృద్ధికి రూ.150 కోట్లు మంజూరు చేయడం అభినందనీయమన్నారు. ఈ నిధుల తో సంస్థ పునరుజ్జీవనం పొందడంతో పాటు కార్మికుల జీవనోపాధి మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి టి.యు.సి.సి రాష్ట్ర కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. నిధుల మంజూరు పై టి.యు.సి.సి మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాలేటి రామచంద్రయ్య కూడా హర్షం వ్యక్తం చేశారు.


Recent Comments