
చిత్తూరు,చిత్తూరు ఎక్స్‌ప్రెస్,మే 25:
ప్రజల భద్రత కోసం ఎండలు, వర్షాలు, దుమ్ము, కాలుష్యాన్ని లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసు సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్, తిరుపతి సహకారంతో చిత్తూరు పోలీస్ గెస్ట్ హౌస్ కాన్ఫరెన్స్ హాల్లో ట్రాఫిక్ పోలీసు సిబ్బందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి యూవీ ప్రొటెక్టెడ్ సన్ గ్లాసెస్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి పాల్గొని సిబ్బందికి సన్ గ్లాసెస్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ విధుల్లో ఉన్న పోలీసులు ఉదయం నుంచి సాయంత్రం వరకు తీవ్ర ఎండలో పనిచేయాల్సి వస్తోందని, దీని ప్రభావం కంటి ఆరోగ్యంపై పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఎండలోని అల్ట్రావయొలెట్ కిరణాల నుంచి కళ్లను రక్షించేందుకు ఈ ప్రత్యేక గ్లాసెస్ ఉపయోగ పడతాయని చెప్పారు. ప్రజల భద్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న పోలీసు సిబ్బంది ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ట్రాఫిక్ పోలీసులు విధుల్లో భాగంగా ఎండ, దుమ్ము, వాహనాల కాలుష్యం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని, ఇలాంటి రక్షణ చర్యలు వారికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కంటి ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలని, చిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ వైద్య బృందం ట్రాఫిక్ పోలీసు సిబ్బందికి ప్రత్యేక కంటి పరీక్షలు నిర్వహించింది. జిల్లా ఎస్పీ తుషార్ డూడి కూడా కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఆసుపత్రి మేనేజర్ మాట్లాడుతూ అధిక ఎండలు, దుమ్ము, కాలుష్యం కారణంగా కంటి పై పొర దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యంగా మధుమేహం ఉన్న వారు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం అవసరమని సూచించారు. ప్రారంభ దశలోనే సమస్యలను గుర్తిస్తే మెరుగైన చికిత్స అందించవచ్చని తెలిపారు. డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ తిరుపతి డైరెక్టర్ సుమంత్ రెడ్డి సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి ప్రతినిధులు వెల్లడించారు. పోలీసు శాఖ ప్రజల కోసం నిరంతరం సేవలందిస్తోందని, కృతజ్ఞతాభావంగా తమ వంతు సహకారం అందిస్తున్నామని తెలిపారు. పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు క్యాష్‌లెస్ చికిత్స సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ డాక్టర్ తరుణ్ పహ్వా, అదనపు ఎస్పీ రాజశేఖర్ రాజు, అగర్వాల్ ఐ హాస్పిటల్ మేనేజర్ దొరైవేలు, కంటి వైద్యుడు శ్రీనివాసరావు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నిత్యబాబు, పట్టణ ఇన్స్పెక్టర్లు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.


Recent Comments