EPAPER
Thursday, August 20, 2026
Google search engine

బక్రీద్ నేపథ్యంలో అక్రమ పశువుల రవాణాపై ప్రత్యేక నిఘా చట్టవిరుద్ధ వధింపులపై కఠిన చర్యలు తప్పవు :  జిల్లా ఎస్పీ తుషార్ డూడి

📰 Generate e-Paper Clip

 

చిత్తూరు,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, మే 25:

 

బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతలు, సామాజిక సామరస్యాన్ని పరిరక్షించేందుకు చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ తుషార్ డూడి వెల్లడించారు. మూగజీవాల అక్రమ రవాణా, చట్టవిరుద్ధ వధింపులు, అనుమతులు లేకుండా పశువుల తరలింపు వంటి చర్యలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘాఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ,పశుసంవర్ధక శాఖ,రెవెన్యూ శాఖ మరియు ఇతర సంబంధిత విభాగాలతో సమన్వయ సమావేశాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలు,కోర్టు మార్గదర్శకాలు, జంతు సంరక్షణ చట్టాల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. బక్రీద్ పండుగను పరస్పర గౌరవ భావంతో, చట్ట నిబంధనలకు లోబడి ప్రశాంత వాతావరణంలో నిర్వహిం చాలని ప్రజలకు సూచించారు. ఆవులు,దూడలు మరియు ఇతర నిషేధిత పశువుల వధ,అక్రమ రవాణా,అనుమతులు లేకుండా తరలింపు వంటి చర్యలను ఏమాత్రం సహించబో మని ఎస్పీ స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా సరిహద్దు ప్రాంతాలు,చెక్‌పోస్టులు,ప్రధాన రహదారులు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. అనుమానాస్పద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందన్నారు. గతంలో ఇలాంటి కేసుల్లో నేరాలకు పాల్పడిన వ్యక్తులపై కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవసరమైతే వారికి నోటీసులు జారీ చేయడంతో పాటు బౌండ్ ఓవర్ చర్యలు కూడా తీసుకోవాల ని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. రోడ్లపై లేదా బహిరంగ ప్రదేశాల్లో జంతువులను వధించడం, వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ వేయడం,జంతు హింసకు పాల్పడడం, నిబంధనలు ఉల్లంఘించడం వంటి చర్యలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అవసరమైతే వాహనాల స్వాధీనం,అరెస్టులు,క్రిమినల్ కేసుల నమోదు వంటి చర్యలు అమలు చేస్తామని హెచ్చరించారు. సోషల్ మీడియా ద్వారా పుకార్లు, వదంతులు వ్యాప్తి చేసి మత సామరస్యానికి భంగం కలిగించే వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎక్కడైనా మూగజీవాల అక్రమ రవాణా,చట్టవిరుద్ధ వధింపులు లేదా అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే డయల్ 112 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. అలాగే చిత్తూరు పోలీస్ వాట్సాప్ నంబర్ 9440900005కు కూడా సమాచారం అందించవచ్చని తెలిపారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!