EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

ఓఎల్ఎక్స్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి సెకండ్ హ్యాండ్ వస్తువుల కొనుగోలు ముందు పూర్తి ధృవీకరణ తప్పనిసరి. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపిఎస్

📰 Generate e-Paper Clip

చిత్తూరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే 13:

 

 

ఆన్‌లైన్ వేదికల ద్వారా సెకండ్ హ్యాండ్ వస్తువుల కొనుగోలు, అమ్మకాల పేరుతో జరుగుతున్న మోసాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడి హెచ్చరించారు. ముఖ్యంగా ఓఎల్ఎక్స్, ఫేస్‌బుక్ మార్కెట్‌ప్లేస్ తదితర సామాజిక మాధ్యమ వేదికలలో తక్కువ ధరలకు వాహనాలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్్లు, కెమెరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు విక్రయిస్తున్నట్లు ప్రకటనలు ఇచ్చి మోసగాళ్లు ప్రజలను వలలో వేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల జిల్లాలో సెకండ్ హ్యాండ్ వస్తువుల కొనుగోలు పేరుతో పలువురు మోసపోయిన ఘటనలు పోలీసుల దృష్టికి వచ్చినట్లు వెల్లడించారు. ముఖ్యంగా కార్లు, బైక్‌లు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్్లు వంటి వస్తువులను తక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు చూపించి ముందుగా అడ్వాన్స్ డబ్బులు తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. కొందరు నకిలీ గుర్తింపు కార్డులు, ఆర్మీ ఉద్యోగుల పేర్లు, పోలీసు ఉద్యోగుల ఫోటోలు ఉపయోగించి ప్రజల నమ్మకాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నారని హెచ్చరించారు. చోరీ చేసిన బైక్‌లు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్్లు తదితర వస్తువులను కూడా తక్కువ ధరలకు విక్రయించే ఘటనలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. తెలియక ఇటువంటి వస్తువులను కొనుగోలు చేసిన వారు కూడా చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. ఇటీవల ఇంజనీరింగ్ చదువుతున్న 22 సంవత్సరాల యువకుడు సచివాలయాలలో చోరీ చేసిన ప్రింటర్లు, ల్యాప్‌టాప్్లను ఓఎల్ఎక్స్‌లో విక్రయిస్తున్నట్లు గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. అతని వద్ద నుంచి సుమారు రూ.8.5 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనుగోలు చేసే ముందు విక్రేత వివరాలు, బిల్లులు, ఆర్‌సీ పత్రాలు, ఐఎంఈఐ నంబర్లు, సీరియల్ నంబర్లు, కొనుగోలు రసీదులు తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. ముఖ్యంగా వాహనాల విషయంలో ఆర్‌టీఓ రికార్డులు ధృవీకరించకుండా కొనుగోలు చేయరాదన్నారు. మొబైల్ ఫోన్ల విషయంలో ఐఎంఈఐ నంబర్‌ను పరిశీలించి అది చోరీకి గురైన ఫోన్ కాదో నిర్ధారించుకోవాలని సూచించారు. అత్యంత తక్కువ ధరలకు వస్తువులు అందిస్తున్నామని చెప్పే ప్రకటనలను చూసి వెంటనే ఆకర్షితులవ్వకూడదన్నారు. మార్కెట్ ధరతో పోల్చి చూసి, విక్రేత వివరాలు ధృవీకరించిన తరువాత మాత్రమే కొనుగోలు చేయాలని తెలిపారు. ముందుగా అడ్వాన్స్ చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొంతమంది మోసగాళ్లు వీడియో కాల్‌ల ద్వారా నకిలీ ప్రదేశాలు చూపించడం, తప్పుడు స్క్రీన్‌షాట్లు పంపించడం, ఆన్‌లైన్ చెల్లింపులు తీసుకుని ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం వంటి పద్ధతులతో మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. వస్తువును ప్రత్యక్షంగా పరిశీలించకుండా, పూర్తి ధృవీకరణ లేకుండా ఎటువంటి ఆన్‌లైన్ చెల్లింపులు చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలియని వ్యక్తులతో ఒంటరిగా వెళ్లి లావాదేవీలు చేయకుండా జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే కొనుగోలు, అమ్మకాలు నిర్వహించాలని సూచించారు. రాత్రి వేళల్లో లేదా అనుమానాస్పద ప్రాంతాల్లో డీల్‌లు చేయకూడదన్నారు. ఏదైనా అనుమానం కలిగితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు. సైబర్ మోసాల పట్ల ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ప్రకటనలు లేదా మోసపూరిత లావాదేవీలు గమనించిన వెంటనే డయల్ 112 లేదా సైబర్ క్రైమ్ సహాయ కేంద్రం 1930కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ తుషార్ డూడి విజ్ఞప్తి చేశారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!