కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మార్చి02
మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై కుప్పం పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తూ మరో భారీ పట్టివేత చేపట్టినట్టు కుప్పం డి.ఎస్.పి పార్థసారథి పాత్రికేయ సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుప్పం పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో సుమారు 40 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, అక్రమ రవాణాకు పాల్పడుతున్న 8 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. చిత్తూరు జిల్లా ఎస్‌పి తుసూర్ డూడి ఆదేశాల మేరకు, కుప్పం ఎస్‌డిపిఓ పర్యవేక్షణలో సోమవారం ఉదయం కుప్పం పట్టణ పరిధిలో విస్తృత తనిఖీలు చేపట్టినట్టు తెలిపారు. ఈ సందర్భంగా కుప్పం అర్బన్ సీఐ శంకరయ్య ఆధ్వర్యంలో ఎస్‌ఐ బాబు, పోలీసు సిబ్బంది వాహనాల తనిఖీలు చేపట్టగా అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించడం జరిగిందన్నారు. ఈ విచారణలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన 8 మంది వ్యక్తులు ఒడిశా రాష్ట్రంలోని కటక్ ప్రాంతం నుండి కేరళ రాష్ట్రానికి అక్రమంగా గంజాయిని తరలిస్తున్నట్లు వెల్లడయిందన్నారు. వారి వద్ద నుంచి సుమారు 40 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు, నిందితులపై ఎన్‌డీపీఎస్ చట్టం 1985 ప్రకారం కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా, రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. కాగా అరెస్ట్ అయిన వారిలో హాసిబుల్, నామిజుల్, సౌమిక్ మండల్, సుమన్ దాస్, హాసినూర్ జమాన్, ముత్తకిమ్ మాలిత, కిరణ్ మండల్, మోజమ్ మండల్ లు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు కొనసాగుతాయని వారు హెచ్చరించారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేయడం, విక్రయించడం లేదా వినియోగించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలపై ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని కోరారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న పోలీసు అధికారులను ఉన్నతాధికారులు అభినందించారు.


Recent Comments