
యాదాద్రి భువనగిరి, చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఆగస్టు 31:
హిమాలయాలు కేవలం మంచుకొండలు కాదని, భారతదేశానికి సహజ రక్షణ కవచాలుగా, దేశంలోని అనేక నదులకు జీవనాధారాలుగా, వాతావరణ సమతుల్యతను కాపాడే కీలకమైన ప్రకృతి సంపదగా ఉన్నాయని మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, వర్తమాన కవయిత్రి శ్రీమతి మంజుల పత్తిపాటి అన్నారు. హిమాలయాల పరిరక్షణపై ఆందోళన వ్యక్తం చేస్తూ సోమవారం ఆమె పత్రికా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంజుల పత్తిపాటి మాట్లాడుతూ.. పర్యాటక రంగం విస్తరణ, విచ్చలవిడిగా జరుగుతున్న నిర్మాణాలు, అడవుల నరికివేత వంటి కారణాలతో హిమాలయాల సహజ స్వరూపానికి తీవ్ర ముప్పు ఏర్పడుతోందన్నారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటే దాని ప్రభావం ఒక్క హిమాలయ ప్రాంతానికే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా కనిపించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. హిమశిఖరాలు క్రమంగా కరుగుతున్నా, ప్రకృతి విపత్తులు తరచూ సంభవిస్తున్నా మనం ఇంకా తగిన స్థాయిలో మేల్కొనకపోవడం ఆందోళనకరమన్నారు. వరదలు, కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వాతావరణ మార్పులు వంటి ప్రకృతి వైపరీత్యాలను ప్రకృతి చేస్తున్న హెచ్చరికలుగా భావించాలని సూచించారు. అభివృద్ధి పేరుతో ప్రకృతి వనరులను విచ్చలవిడిగా వినియోగించ కుండా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. మొక్కలు నాటాలని, అడవులను కాపాడాలని, హిమాలయాలను పరిరక్షించాలని పిలుపునిచ్చారు. ప్రకృతి సంపదను భావితరాలకు భద్రంగా అందించడమే ప్రస్తుత తరానికి ఉన్న ప్రధాన బాధ్యత అని మంజుల పత్తిపాటి పేర్కొన్నారు.


Recent Comments