కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మార్చి 03:
గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా ప్రతిభలో ఏమాత్రం తగ్గరని మరోసారి నిరూపిస్తూ కుప్పం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని జాతీయ స్థాయిలో నిర్వహించిన ఆంగ్లభాష ఒలింపియాడ్‌లో విశేష ప్రతిభ కనబరిచిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సంస్కృతి తిరుపతి సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన జాతీయ ఆంగ్లభాష ఒలింపియాడ్ పోటీలలో తమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని వర్షిణి జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానాన్ని సాధించడం ఆనందంగా ఉందన్నారు. గ్రామీణ నేపథ్యంలో చదువుకుంటున్నప్పటికీ ఆంగ్ల భాషపై మంచి పట్టు సాధించి జిల్లా స్థాయిలో ర్యాంకు సాధించడం పాఠశాలకు గర్వకారణమని అన్నారు. విద్యార్థిని కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకం, తల్లిదండ్రుల ప్రోత్సాహమే ఈ విజయానికి కారణమన్నారు. ఆంగ్ల ఉపాధ్యాయులు, ఇతర ఉపాధ్యాయులు విద్యార్థినిని అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ విజయంతో పాఠశాల ఖ్యాతి మరింత పెరిగిందని స్థానిక విద్యాభిమానులు అభిప్రాయం వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు విద్యా రంగంలో నిరంతరం ప్రతిభ కనబరుస్తూ కుప్పం ప్రాంతానికి మంచి పేరు తీసుకువస్తున్నారని పలువురు ప్రశంసించారు.


Recent Comments