
కుప్పం, చిత్తూరు ఎక్స్ ప్రెస్ , జూలై 18:
కుప్పం ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలోని కుప్పం డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో శనివారం “పర్యావరణ స్థిరత్వం – ప్లాస్టిక్ రహిత సమాజం” అంశంపై అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై బాధ్యతను పెంపొందించడం, ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై చైతన్యం కల్పించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ప్రముఖ పర్యావరణవేత్త, ఎకో-సేవియర్ అధ్యక్షుడు డాక్టర్ పాలేటి శివాజీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్యం తీవ్రమైన పర్యావరణ సంక్షోభంగా మారిందని, ఇది భూమి, నీరు, గాలి మాత్రమే కాకుండా మానవ ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపారు. ఒక్కసారి ఉపయోగించి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని పూర్తిగా తగ్గించడం ద్వారా మాత్రమే పర్యావరణాన్ని రక్షించగలమన్నారు. యువతలో పర్యావరణంపై అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని, ప్రతి విద్యార్థి తన కుటుంబం, సమాజంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే దిశగా చైతన్యం తీసుకురావాలని సూచించారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యతను స్వీకరిస్తే భావితరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించగలమన్నారు. కళాశాల వైస్ చైర్మన్ సాగర్ రాజ్ మాట్లాడుతూ, ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణ ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని అన్నారు. కళాశాల జాతీయ సేవా పథకం విద్యార్థి బృందం ద్వారా కుప్పం పరిసర ప్రాంతాల్లోని పాఠశాలలు, గ్రామాల్లో ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై చైతన్యం కల్పిస్తామని తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ డి. సుధారాణి మాట్లాడుతూ, విద్యతో పాటు సామాజిక బాధ్యతలను విద్యార్థులు అలవర్చుకోవాలని సూచించారు. వైస్ ప్రిన్సిపల్ షణ్ముగం పర్యావరణ పరిరక్షణలో విద్యాసంస్థల పాత్రను వివరించగా, జాతీయ సేవా పథకం సమన్వయకర్త నగేష్ కార్యక్రమ నిర్వహణను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, జాతీయ సేవా పథకం వాలంటీర్లు, విద్యార్థులు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.


Recent Comments