EPAPER
Thursday, August 20, 2026
Google search engine

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా  కడ పీడీ వికాస్ మర్మాత్ పర్యటన

📰 Generate e-Paper Clip

 

రామకుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూన్09:

 

ప్రజలకు మెరుగైన ప్రభుత్వ సేవలు అందించడంతో పాటు క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి పరిష్కరించే లక్ష్యంతో కడ ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మాత్ ఆకస్మిక క్షేత్ర పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలోని వీర్నమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నాన్యాల తండా, రామకుప్పం అన్న క్యాంటీన్, శాంతిపురం అన్న క్యాంటీన్‌లను సందర్శించి సేవల తీరును పరిశీలించారు. మొదటగా వీర్నమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఆయన ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, సిబ్బంది హాజరు, విధుల నిర్వహణను పరిశీలించారు. వైద్య సిబ్బందితో సమావేశమై గత పర్యటనలో కోరిన పలు సౌకర్యాలు, పరికరాలను ఇప్పటికే అందించినప్పటికీ ప్రజల నుంచి మరింత సానుకూల స్పందన వచ్చేలా సేవల నాణ్యతను మెరుగుపరచాలని సూచించారు. అనంతరం ఆశా కార్యకర్తలతో సమావేశమై గ్రామీణ ప్రజలకు టాటా సంజీవని సేవలపై విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి వ్యక్తికి ఆరోగ్య సేవలు చేరేలా కృషి చేయాలని సూచించారు. వీర్నమల నుంచి నన్యాల తండాకు వెళ్తున్న మార్గంలో గుత్తూరు తండా వద్ద వాహనాన్ని నిలిపి స్థానికులతో మాట్లాడారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని, వాటిలో ఒక సమస్యను వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నన్యాల తండాలో గ్రామస్తులతో సమావేశమైన ఆయన తాగునీటి సరఫరా, మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలోకి అడవి ఏనుగులు ప్రవేశించకుండా రక్షణ కంచె ఏర్పాటు చేయాలన్న ప్రజల విజ్ఞప్తిపై అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే గ్రామంలో హైమాస్ట్ విద్యుత్ దీపం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరగా నెలాఖరులోగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం రామకుప్పం, శాంతిపురంలోని అన్న క్యాంటీన్లను సందర్శించి ఆహార నాణ్యత, పరిశుభ్రత, భోజనం వడ్డించే విధానం, ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించారు. క్యాంటీన్లలో భోజనం చేస్తున్న ప్రజలతో కలిసి భోజనం చేసి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అందిస్తున్న ఆహారం, సేవల పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించేందుకు కడ యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందని ప్రాజెక్టు డైరెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!