
పల్నాడు, చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూలై 11:
సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ–2005)పై ప్రజల్లో చైతన్యం పెంపొందించడం, ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పనిచేస్తున్న RTI Activists Association (ఆంధ్రప్రదేశ్–తెలంగాణ) విజయవంతంగా నాలుగేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. 2022లో వ్యవస్థాపక అధ్యక్షుడు జి. ముత్తు నాయకత్వంలో ప్రారంభమైన ఈ సంఘం, సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ప్రభుత్వ శాఖల నుంచి చట్టబద్ధంగా సమాచారాన్ని పొందే విధానాలపై మార్గనిర్దేశం చేస్తోంది. అలాగే ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పెంపునకు ఆర్‌టీఐ చట్టం సమర్థవంతమైన సాధనమని విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. గత నాలుగేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా ఆర్‌టీఐ కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమాలు, అవగాహన సదస్సులు, న్యాయ శిబిరాలు నిర్వహించిన సంఘం, సమాచార హక్కు దరఖాస్తుల తయారీ, మొదటి, రెండో అప్పీళ్ల ప్రక్రియలపై ప్రజలకు సహాయం అందిస్తూ విశేష సేవలు అందిస్తోంది. ఈ సందర్భంగా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జి. ముత్తు మాట్లాడుతూ, ప్రతి పౌరుడికి సమాచారాన్ని తెలుసుకునే హక్కు రాజ్యాంగబద్ధమైనదని, ఆ హక్కును ప్రజలు సమర్థంగా వినియోగించుకునేలా అవగాహన కల్పించడం తమ సంఘం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం భవిష్యత్తులోనూ మరింత విస్తృతంగా సేవలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. నాలుగేళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. యువతను సమాచార హక్కు ఉద్యమంలో భాగస్వాములను చేసి, ప్రతి గ్రామానికి ఆర్‌టీఐ చట్టంపై అవగాహన తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. ప్రజల హక్కుల పరిరక్షణతో పాటు పారదర్శక పాలన సాధన కోసం తమ సేవలు నిరంతరం కొనసాగుతాయని సంఘం ప్రతినిధులు తెలిపారు.


Recent Comments