EPAPER
Wednesday, August 19, 2026
Google search engine

పులులను కాపాడితేనే ప్రకృతి సమతుల్యత ఒంటిమిట్ట శ్రీ సాయి భారతి హైస్కూల్‌లో ప్రపంచ పులుల దినోత్సవం ఘనంగా నిర్వహణ

📰 Generate e-Paper Clip

ఒంటిమిట్ట,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, జూలై 29:

 

పులులను సంరక్షించడం ద్వారా మాత్రమే ప్రకృతిలో సమతుల్యతను కాపాడగలమని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రపంచ పులుల దినోత్సవాన్ని పురస్కరించు కుని ఒంటిమిట్టలోని శ్రీసాయి భారతి హైస్కూల్‌లో బుధవారం అటవీశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అడవుల పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, పులుల ప్రాముఖ్యతపై అధికారులు వివరించారు. పులులు అడవుల ఆరోగ్యానికి ప్రతీకలని, జీవవైవిధ్య పరిరక్షణలో వాటి పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. పులుల సంఖ్య పెరగడం అంటే అడవులు సురక్షితంగా ఉన్నాయనే సంకేతమని పేర్కొన్నారు. అడవుల నరికివేత, అక్రమ వేట, పర్యావరణ కాలుష్యం వంటి కారణాల వల్ల గతంలో పులుల సంఖ్య గణనీయంగా తగ్గిందని, వాటి సంరక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ప్రతి సంవత్సరం జూలై 29న ప్రపంచ పులుల దినోత్సవాన్ని నిర్వహించడం వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని విద్యార్థులకు వివరించారు. 2010లో రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో తీసుకున్న నిర్ణయాల మేరకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పులులను రక్షించడం అంటే ప్రకృతిని, పర్యావరణాన్ని, భవిష్యత్ తరాలను సంరక్షించడమేనని అధికారులు పేర్కొన్నారు. అడవులు భూమికి ఊపిరితిత్తుల వంటివని, వర్షపాతం, స్వచ్ఛమైన గాలి, జీవవైవిధ్య పరిరక్షణకు అవి అత్యంత అవసరమని వివరించారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి, అడవులను కాపాడే బాధ్యతను స్వీకరించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రామ తులసి, ప్రధానోపాధ్యాయుడు సుబ్బరామయ్య, ఉపాధ్యాయుడు సురేష్ పాల్గొన్నారు. అటవీశాఖ తరఫున డీఆర్‌వో నాగు నాయక్, ఎఫ్‌ఎస్‌వో బ్రహ్మయ్య, ఎఫ్‌బీవోలు సరోజ, హేమలత, భార్గవి, మహబూబ్ బాషా, ఏబీవో సుబ్బరాయుడు తదితరులు హాజరై విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రకృతి, వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించిన పలు అంశాలపై ఆసక్తి కనబరిచారు.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!